sonam-kapoor

సోనమ్ కపూర్ కు జన్మదిన శుభాకాంక్షలు

21

ఒకప్పుడు సినిమాకు పనికిరాదంటూ సినీ వర్గాల్లో విమర్శలు ఎదుర్కొన్న నటి.. ఇప్పుడు బాలీవుడ్లో తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సోనమ్ కపూర్… అంతేకాదు ఆమె ఇప్పుడు బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరు… రేపు సోనమ్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు ఆమె గురించి….

sonam 2

1985లో జూన్ 9న ముంబైలోని పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు సోనమ్ కపూర్… ఆమె తండ్రి ప్రముఖ నటుడు, నిర్మాత అనిల్ కపూర్, ఆమె తల్లి సునీత మాజీ మోడల్, డిజైనర్. సోనమ్ కపూర్ కు ఒక చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. చెల్లెలు రియా కపూర్ నిర్మాత, తమ్ముడు హర్షవర్ధన్ నటుడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమను కపూర్ల ఫ్యామిలీ ఏలుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, సంజయ్ కపూర్ ల తమ్ముడు అనిల్ కపూర్… అనిల్ కపూర్ బాలీవుడ్ లో ప్రముఖ నటుడు, నిర్మాత. ప్రముఖ నటులు అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్, మోహిత్ మార్వా, జాహ్నవి కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, రాణీ ముఖర్జీ వీళ్లంతా సోనమ్ కు బంధువులే.

sonam1

సోనమ్ జుహూలోని ఆర్య విద్యామందిర్ పాఠశాలలో విద్యనభ్యసించారు. చిన్నతనంలో సోనమ్ చాలా అల్లరి చేసేదట… రగ్బీ, బాస్కెట్ బాల్ వంటి ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచేవారట సోనమ్. కథక్, శాస్త్రీయ సంగీతం, లాటిన్ నృత్యాల్లో శిక్షణ తీసుకున్నారు సోనమ్. సోనమ్ హిందూ సంప్రదాయాలను తప్పకుండా పాటిస్తారు. సింగపూర్ లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్ అఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాలో థియేటర్ ఆర్ట్స్ చదువుకున్నారు సోనమ్.

sonam 5

2005లో బ్లాక్ సినిమాకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర సహాయ దర్శకురాలిగా పనిచేశారు సోనమ్. దీంతో తొలిసారిగా సినిమారంగంలో అడుగుపెట్టారు సోనమ్ కపూర్. ఆ తరువాత 2007లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన “సావరియా” చిత్రంతో హీరోయిన్ గా తెరంగ్రేటం చేశారు. ఈ సినిమాలో సోనమ్ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ నటి పురస్కారం లభించింది. ఆ తరువాత 3 సంవత్సరాలకు అంటే 2010లో వచ్చిన “ఐ హేట్ లవ్ స్టోరీస్” చిత్రంతో మొదటి సారిగా కమర్షియల్ హిట్ సాధించారు. ఆపై వచ్చిన సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలయ్యాయి. మళ్ళీ 2013లో హీరో ధనుష్ తో కలిసి ఆమె నటించిన “రాంఝాన” చిత్రం సోనమ్ కెరీర్ ను అతిపెద్ద మలుపు తిప్పింది.

Raanjhnaa

2014లో ఖూబ్ సూరత్, 2015లో డాలీకి డోలి చిత్రాల్లో సోనమ్ నటనకుగాను ఫిలింఫేర్ ఉత్తమనటి పురస్కారానికి నామినేషన్లను పొందాయి. 2015లో సల్మాన్ ఖాన్ సరసన సోనమ్ నటించిన “ప్రేమ్ రతన్ ధన్ పాయో” చిత్రం ఆమె కెరీర్ లో అత్యంత్య ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రం. 2016లో సోనమ్ నటించిన “నీరజ” సినిమా ఎక్కువ వసూళ్లను సాధించడమే కాకుండా విమర్శకుల ప్రసంశలు సైతం అందుకుంది. ఆ తరువాత రెండు సంవత్సరాలు వెండి తెరకు దూరంగా ఉంది సోనమ్ కపూర్. 2018లో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సామాజిక చిత్రం “ప్యాడ్ మాన్” చిత్రంలో సోనమ్ నటించింది.

padman

2018 మే 8న ఆనంద్ ఆహుజా అనే వ్యాపారవేత్తను సోనమ్ కపూర్ పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ పెళ్లి. బాంద్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో బాలీవుడ్ అతిరథమహారథుల మధ్య సంప్రదాయబద్ధంగా, వైభవంగా వీరి పెళ్ళి జరిగింది.

sonam 3

ఆ తరువాత నలుగురు స్నేహితుల జీవితకథ నేపథ్యంలో తెరకెక్కిన “వీరే ది వెడ్డింగ్” అనే చిత్రంలో నటించింది సోనమ్. ఇందులో సోనమ్ తో పాటు కరీనా కపూర్, స్వర భాస్కర్, శిఖా తలసానియా నటించారు. జూన్ 1న ఈ చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద 88 కోట్లు కొల్లగొట్టింది. కానీ ఈ చిత్రంలో నటీనటుల పాత్రలపై పలు విమర్శలు రావడం గమనార్హం. ప్రస్తుతం సంజయ్ డాట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న “సంజూ” చిత్రంలో సోనమ్ కపూర్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇంకా ఇప్పుడు సోనమ్ కపూర్ రెండు చిత్రాలు చేయబోతున్నారు. పెళ్ళి తరువాత కూడా సోనమ్ సినిమాల్లో తన జోరును ఏమాత్రం తగ్గించలేదు.

veere-di-wedding-poster

సోనం వివిధ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటికి అవగాహన కార్యక్రమాలు చేశారు. ఎన్నో బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారామె. ఇప్పుడు బాలీవుడ్లో సోనమ్ ఒక ఫ్యాషన్ క్వీన్…

రేపు ఈ ఫ్యాషన్ క్వీన్ పుట్టినరోజు సందర్భంగా నవ్యమీడియా తరపున సోనమ్ కు పుట్టినరోజు కృతజ్ఞతలు….

– విమలత