telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా పుట్టిన రోజునే విడుదలైన బాలకృష్ణ ‘కథానాయకుడు’

Rana

దగ్గుబాటి ఫ్యామిలీలో లక్కీ బోయ్ ఎవరంటే రానా పేరే వినిపిస్తుంది. రానా పుట్టిన వేళావిశేషమే అలాంటిది మరి! 1984 డిసెంబర్ 14న రానా భూమిపై కన్ను తెరిచాడు. ఆ రోజున రానా తాత డి.రామానాయుడుకు భలేగా కలిసొచ్చింది. అంతకు ముందు అనేక సూపర్ డూపర్ హిట్స్ అందించారు రామానాయుడు. 1983లో కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా నాయుడు తీసిన మల్టీస్టారర్ ‘ముందడుగు’ బిగ్ హిట్. సిల్వర్ జూబ్లీ చేసుకుంది. ఆ తరువాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు. 1983లో చిరంజీవితో తీసిన ‘సంఘర్షణ’ యావరేజ్ గా ఆడింది. దాంతో తరువాతి సంవత్సరం బాలకృష్ణ హీరోగా ‘సంఘర్షణ’ డైరెక్టర్ కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలోనే ‘కథానాయకుడు’ నిర్మించారు రామానాయుడు. ఆ సినిమాతో మురళీమోహన్ రావు ఉండేది, ఇంటికెళ్ళేది తేలిపోతుందనీ షూటింగ్ జరిగేటప్పుడు అంటూ ఉండేవారట. ‘కథానాయకుడు’ 1984 డిసెంబర్ 14న విడుదలై విజయఢంకా మోగించి, సిల్వర్ జూబ్లీ చేసుకుంది. అదే రోజున రామానాయుడు పెద్దకొడుకు సురేశ్ బాబుకు రానా పుట్టాడు.

దాంతో దగ్గుబాటి ఫ్యామిలీలో లక్కీబాయ్ గా రానా పేరొందాడు. తన మనవడు రానా పుట్టినరోజునే సిల్వర్ జూబ్లీ హిట్ గా ‘కథానాయకుడు’రావడం గురించి రామానాయుడు గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. తరువాతి రోజుల్లో తాను నిర్మించిన పలు చిత్రాలకు రానాతోనే క్లాప్ కానీ, కెమెరా స్విచ్చాన్ గానీ చేయించేవారు రామానాయుడు. నిజానికి రానా అసలు పేరు రామానాయుడే! దానినే కుదిస్తే రానా అయింది. ఈ చిన్న రామానాయుడు తాత బాటలో పయనించి ముందు నిర్మాతగా మారాలని భావించాడు. విజువల్ ఎఫెక్స్ట్ ప్రొడ్యూసర్ గా మారి కొన్ని సినిమాలకు తన ‘స్పిరిట్ మీడియా’ ద్వారా స్పెషల్ ఎఫెక్ట్స్ రూపొందించాడు. 2006లో మహేశ్ బాబు ‘సైనికుడు’ సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ కూర్చి నంది అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. తరువాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి డైరెక్షన్ లో ‘బొమ్మలాట’ అనే సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నాడు రానా. ఇలా సాగిన రానా చివరకు బాబాయ్ వెంకటేశ్ బాటలోనే నడుస్తూ ‘లీడర్’ సినిమాతో యాక్టర్ అయ్యాడు. ఆ మాట కొస్తే రామానాయుడుకు కూడా ఎప్పటి నుంచో నటుడు కావాలన్న అభిలాష ఉండేది. అందుకే ఆయన తన తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ మొదలు తాను నిర్మించిన పలు చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ ఉండేవారు. అలా నటునిగానూ రామానాయుడు సాగారు. ఆ విధంగా రానా కూడా తాత బాటనే ఎంచుకుని నటుడయ్యాడని చెప్పొచ్చు. దగ్గుబాటి ఫ్యామిలీలో థర్డ్ జెనరేషన్ లో మెరుస్తూ ఉన్నది రానా ఒక్కడే! అలా ఇప్పటికీ ‘లక్కీ బాయ్’గానే సాగుతున్న రానా మునుముందు ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటాడో చూద్దాం.

Related posts