telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేడే అందాలతార సలోని పుట్టినరోజు

తెలుగు చిత్రసీమలో ఉత్తరాది భామల హవా విశేషంగా వీస్తూనే ఉంది… ఆ గాలిలో మత్తుగా గమ్మత్తుగా సిత్రాలు చేస్తున్నవారెందరో… వారిలో అందాల భామ సలోని ‘తెలుగమ్మాయి’గా మనవాళ్ళ మనసు దోచింది … డిసెంబర్ 3న సలోని బర్త్ డే… సలోని పేరు వినగానే సరసుల మదిలో ఆనందం చిందులు వేయక మానదు. ముద్దుగా బొద్దుగా ఉంటూనే ఇట్టే ఆకట్టుకోగల ఓర్పు, నేర్పు సలోని సొంతం. రాజమౌళి ‘మర్యాదరామన్న’లో నాయికగా మురిపించిన సలోని ప్రస్తుతం మునుపటిలా బిజీగా కాకపోయినా, ఏదో విధంగా తెలుగుతెరపై వెలుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం వి.యన్. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో సలోని సయ్యాటలాడబోతోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే సాగుతోంది. తెలుగమ్మాయి కాకపోయినా, ఆ టైటిల్ తో రూపొందిన చిత్రంలో అచ్చం తెలుగింటి ఆడపడచులాగే కనిపించి మురిపించింది సలోని. ఈ బాల మురిపాలు కుర్రకారును కిర్రెక్కించాయని చెప్పక తప్పదు. దాదాపు పదిహేనేళ్ళ క్రితం సుమంత్ హీరోగా రూపొందిన ‘ధన 51’తో తొలిసారి తెలుగువారిని పలకరించింది సలోని. ఆ సినిమా తరువాత వరుసగా “ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, కోకిల” వంటి చిత్రాలతోనూ మురిపించింది. ఆపై తమిళ,కన్నడ చిత్రాల్లోనూ అదృష్టం పరీక్షించుకుంది. అయితే తెలుగులో లాగా ఎక్కడా సలోని సందడి చేయలేకపోయింది. మళ్ళీ తెలుగు
చిత్రాలపైనే సలోని దృష్టి సారించిన సమయంలో అనుకోకుండా రాజమౌళి ‘మగధీర’లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. అదే ఆమెకు ఓ వరంగా మారింది. ఆ సినిమాలో కేమియో రోల్ లో కనిపించడంతోనే సలోని ని తన ‘మర్యాదరామన్న’లో నాయికగా ఎంచుకున్నాడు రాజమౌళి. ‘మర్యాద రామన్న’ సాధించిన అఖండ విజయంతో సలోని సయ్యాట మరికొంత కాలం సాగింది. టాప్ స్టార్స్ బాలకృష్ణ, వెంకటేశ్ తోనూ నటించే అవకాశాలు దక్కాయి. బాలయ్యతో ‘అధినాయకుడు’లో మురిపించిన సలోని, వెంకటేశ్ జోడీగా ‘బాడీగార్డ్’లో కనిపించింది. ఆ తరువాత మరోమారు దక్షిణాది చిత్రాలపై దృష్టి సారించిన సలోనికి ఎక్కడా ఆశించిన స్థాయిలో సక్సెస్ సొంతం కాలేదు. తెలుగులో సలోని నటించిన చివరి చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కూడా అంతగా అలరించలేకపోయింది. ప్రస్తుతం సలోని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వి.యన్. ఆదిత్య తెరకెక్కిస్తోన్న చిత్రంలో మరోమారు సునీల్ సరసన నటిస్తోంది. ఈ చిత్రంతో మళ్ళీ తెలుగువారిని ఆకట్టుకొనే ప్రయత్నంలో ఉంది సలోని. ఈ పుట్టినరోజు తరువాత సలోని మునుపటిలా మురిపిస్తుందేమో చూడాలి.

Related posts