ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార బర్త్ డే కావడంతో ఇటు అభిమానులు పలువురు సినీ ప్రముఖులు సితారకి బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ సితార పేరుతో అన్నదానం, రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహేష్ సితార ఏడో జన్మదినోత్సవం సందర్భంగా మహేష్ తాజాగా సోషల్ మీడియా ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశాడు. సితార పుట్టినప్పటి నుంచి ఒక్కో ఏడాది తీసిన ఫోటోలను ఓ వీడియో రూపంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. “హ్యపీ బర్త్‌డే సితార. సమయం చాలా తొందరగా గడిచిపోతోంది. నీతో గడిపిన ప్రతీ క్షణం నాకు చాలా ప్రత్యేకం. నీ జీవితం ఎల్లప్పుడూ ప్రేమతో, సంతోషంతో పాజిటివిటీతో నిండాలని కోరుకుంటున్నా. నువ్వు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా” అంటూ మహేష్ కామెంట్ చేశాడు. సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పుడప్పుడు మహేష్ లేదా నమ్రత సితారకి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇటీవల సొంతంగా యూట్యూబ్ లో ఓ ఛానల్ కూడా ప్రారంభించింది. తన ఫ్రెండ్ తో కలిసి A&S అనే పేరుతో చానల్ ను ప్రారంభించారు సితార. ఇందులో ‘A’ అంటే ఆద్య. ఈ అమ్మాయి ఎవరో కాదు దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె. ‘S’ అంటే సితార. ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో A&S యూట్యూబ్ చానల్ ఆరంభించారు. మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వారానికి ఓ వీడియో షేర్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తానని సితార తెలిపింది.