telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

నిర్భయ నిందితులకు ఉరే అన్న సుప్రీం .. ఎప్పుడంటూ వాపోతున్న బాధితురాలి తల్లి..

Refusal to nirbhaya apologize

నిర్భయ ‘హత్యాచార’ కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌కు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. అక్షయ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు బుధవారం కొట్టివేసింది. 2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారా మెడికల్‌ విదార్థినిని అక్షయ్‌తోపాటు మరో ఐదుగురు నిందితులు కిరాతకంగా అత్యాచారం చేసి, కదులుతున్న బస్సులో నుంచి తోసివేయడంతో ఆమె ఆ తరువాత మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష పడగా, మరొకరు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో 2017, మే 5న ముగ్గురు దోషులతోపాటు తనకు మరణశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు వెలువరించిన తీర్పును పునర్‌పరిశీలించాలంటూ అక్షయ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు క్షమాభిక్ష దాఖలు చేసుకునేందుకు మూడు వారాల గడువునివాలన్న పిటిషన్‌ను కూడా జస్టిస్‌ ఆర్‌.భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భన్‌, జస్టిస్‌ ఎఎస్‌ బోపన్న నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేస్తూ, మరణశిక్షను సమర్థించింది.

రివ్యూ పిటిషన్‌ అంటే ఒకే అంశంపై వాదనలు వినడం కాదని బెంచ్‌ అభిప్రాయపడింది. పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు చట్టప్రకారం దోషికి వారం రోజులు గడువు ఉంటుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరణ శిక్షలు నేరస్థులను చంపేస్తాయి కానీ, నేరాలను కాదని విచారణ సమయంలో అక్షయ్‌ తరుపు న్యాయవాది ఎపి సింగ్‌ వాదించారు. దీనికి ఉదాహరణగా మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ దారుణ హత్య కేసులో నళినితో పాటు దోషులకు ఉరితీయకపోవడాన్ని ప్రస్తావించారు. దోషులకు మరణ శిక్షే సరైనదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. ‘మానవత్వమే సిగ్గుపడే రీతిలో దోషులు నేరానికి పాల్పడ్డారు. ఇటువంటి కేసుల్లో వారి పట్ల దయ చూపకూడదు’ అని ఆయన చెప్పారు. నిర్భయ కేసు వాదనలు వినేందుకు నిర్భయ తల్లిదండ్రులు కోర్టుకు హాజరయ్యారు. అయితే ఇటు వారంలో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసినా, శీతాకాల సెలవులు ఉండటంతో జనవరి 7కు వాయిదా వేసింది పటియాలా హౌస్ కోర్ట్. తీర్పు వినగానే నిర్భయ తల్లి కుప్పకూలిపోయారు. తమకు న్యాయం ఆలస్యమౌతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts