దేశంలో చాపకింద నీరులా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో శానిటైజర్ల ధరలను తగ్గించాలని నిర్ణయించినట్టు పలు కంపెనీలు స్పష్టం చేశాయి. జూన్ 30 వరకూ హ్యాండ్ శానిటైజర్ల ధరలను 200 ఎంఎల్ శానిటైజర్ ధరను గరిష్ఠంగా రూ. 100కు పరిమితం చేస్తూ, కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కంపెనీలు ధరలను తగ్గించినట్టు తెలుస్తోంది.
దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొన్న సమయంలో ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించామని హిందుస్థాన్ యూనీ లీవర్, ఐటీసీ, డాబర్, హిమాలయ, గోద్రేజ్ తదితర ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రకటించాయి. శానిటైజర్లకు గిరాకీ పెరిగినందున ఉత్పత్తిని కూడా పెంచామని వెల్లడించాయి. తాము సూచించిన ధరకే రిటైల్ అమ్మకాలు సాగించాలని వ్యాపారస్తులను కోరినట్టు ఆయా కంపెనీలు వెల్లడించాయి.