గుంటూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50కి చేరుకొంది. దీంతో రోజు విడిచి రోజు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం నుంచి పట్టణంలో పూర్తి లాక్ డౌన్ మొదలైంది. నగర పరిధిలో నిన్నటివరకూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. నేడు దాన్ని కూడా తొలగించి, నగరాన్ని దిగ్బంధించారు. కేవలం మెడికల్ షాపులు, ఆసుపత్రులు మాత్రమే తెరచి వుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
ఇక ఈ రోజు ఉదయంనుంచి గుంటూరులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను అధికారులు మూసివేశారు. దీంతో బ్రాడీపేట, అరండల్ పేట ప్రాంతానికి, హిందూ కాలేజ్ సెంటర్ కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. బస్టాండ్ సమీపంలోని ఫ్లై ఓవర్ ను మూసివేయడంతో రహదారులపై వాహనాలే కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం పూట కూరగాయలను అమ్ముకునేందుకు ఎంతో ప్రయాసపడి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన చిరు వ్యాపారులు మార్కెట్ ను తెరిచేందుకు వీల్లేదని అధికారులు స్పష్టం చేయడంతో వెనుదిరిగారు.