telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

32 ఏండ్లుగా ఆ గ్రామానికి పంచాయతీ ఎన్నికలు లేవు..

gudem

మంచిర్యాల జిల్లా గోదావరి తీరాన వెలిసిన గూడెం గ్రామానికి ఎంతో గుర్తింపు ఉంది. అభినవ శబరిమలగా తెలంగాణ అన్నవరంగా పేరున్న గూడెం గుట్ట అంటే తెలియని వారుండరు. అంతటి పేరు ప్రఖ్యాతులు కలిగిన ఈ గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదు. గ్రామానికి 32 ఏండ్లుగా పంచాయతీ ఎన్నికలు లేకపోవడమే ఇందుకు కారణం. దశాబ్దాల తరబడి అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. రాష్ట్రపతి డీనోటిఫై చేస్తే తప్ప ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం లేదు.

gudem

గూడెంలో సుమారు 3వేల జనాభా ఉన్నది. 1,866 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలోని సత్యనారాయణ స్వామి దేవాలయం రెండో అన్నవరంగా పేరొందింది. గూడెం గుట్ట పక్కనే మరో కొండపైన అయ్యప్పస్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ మాలధారణకు స్వాములు పెద్ద ఎత్తున వస్తుంటారు. చారిత్రాత్మకంగా ఈ గూడెం గ్రామానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఇంత చరిత్ర ఉన్న ఊరు అభివృద్ధికి దూరంగా నిలిచిపోయింది. ఈ గ్రామానికి ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికలు జరగక పోవడంతో ప్రత్యేకాధికారి పాలనలో కొనసాగుతున్నది.

gudem

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 1950 నుంచి ఏజెన్సీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఒక గ్రామాన్ని ఏజెన్సీగా గుర్తించాలంటే కనీసం 50 శాతం గిరిజనులు ఉండాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 412 ఏజెన్సీ గ్రామాలు ఉండగా, అందులో గూడెం పంచాయతీ ఒకటి. 1987 పంచాయతీరాజ్ చట్టం అనుసరించి గూడెం షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేశారు. సర్పంచ్ స్థానంతోపాటు, సగం వార్డులు ఎస్టీలకు కేటాయించారు. గూడెం పంచాయతీ పరిధిలో గూడెం, రంగంపేట గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు గ్రామాల్లో ఒక్క ఎస్టీ కూడా లేకపోవడంతో ఒక్క స్థానానికి కూడా నామినేషన్లు వేసే పరిస్థితి లేదు. గూడెం పక్కనే కొండ ఉండటం, ఊరు పేరు గూడెం అని ఉండటంతో దీన్ని అధికారులు గిరిజన గ్రామంగా భావించి నోటిఫైడ్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ సారి కూడా రిజర్వేషన్ ఎస్టీ రావడంతో ఎన్నికలు జరగవని గ్రామస్థులు అంటున్నారు.

Related posts