భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. మంగళవారం రాజ్‌భవన్ ఆవరణలో సీజేఐ మొక్క నాటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి గ్రీన్ కవర్‌ను పెంచే కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుతూ, భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం పచ్చదనాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా ప్రకృతి మాతను రక్షించడం చాలా ముఖ్యమన్నారు.
గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఇదే సమయానుకూలమైన చొరవ అన్నారు. పర్యావరణ సమతుల్యతను నిర్ధారించడానికి, పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి ఈ కార్యక్రమాలను భారీ స్థాయిలో చేపట్టాల్సిన అవసరాన్ని సీజేఐ నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీకారకర్త, ఎంపీ సంతోష్ కుమార్, సీనియర్ జ్యుడిషియల్ అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. చీఫ్ జస్టిస్ భాగస్వామ్యం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చొరవను మరింత పెంచుతుందన్నారు. భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పచ్చదనాన్ని మరింతగా పెంచాలన్నారు