telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాఠశాలలు, సినిమా థియేటర్ల రీఓపెనింగ్ పై నిర్ణయం వాయిదా

Theatre

అక్టోబర్‌ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులను 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరవడానికి అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ సెప్టెంబర్ 30న ఉత్తర్వులను జారీ చేసింది. కానీ పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లను తిరిగి ఓపెన్ చేసే విధానాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. తాజాగా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కుల పునఃప్రారంభంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ప్రకటించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పాఠశాలలు, సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభించే తేదీలను ప్రకటిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ ఉంటుంది. ఈ సమయంలో అత్యవసర వైద్య సేవలు, నిత్యావసరాల కోసం మాత్రమే అనుమతి ఉంటుంది. కంటైన్మెంట్‌ జోన్లు కాకుండా బయట లాక్‌డౌన్‌కు ముందు అనుమతించిన అన్ని కార్యక్రమాలను అనుమతిస్తారు. సామాజిక, విద్య, క్రీడలు, వినోద, సాంస్కృతిక, మత, రాజకీయ కార్యక్రమాల సమావేశాలను కేవలం 100 మందికి మించకుండా కంటైన్మెంట్‌ జోన్లకు వెలుపలి ప్రాంతాల్లో అనుమతిస్తారు. అలాగే వివాహాది కార్యక్రమాలు, అంత్యక్రియలు, సంబంధిత కార్యక్రమాలకు 100 మందిని మాత్రమే అనుమతిస్తారు. కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ మరియు దూరవిద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉన్నత విద్యా సంస్థలు అక్టోబర్‌ 15 నుంచి కేవలం ల్యాబ్‌లు అవసరమున్న పీహెచ్‌డీ, సాంకేతిక/వృత్తి విద్యా కోర్సుల పీజీ విద్యార్థుల కోసం తెరవడానికి అనుమతిస్తారు. ఇందుకు ఉన్నత విద్యా సంస్థల అధిపతి సంతృప్తి చెందాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 15 నుంచి క్రీడాకారుల శిక్షణకు ఉపయోగించే స్విమ్మింగ్‌ పూల్స్, వాణిజ్య ఎగ్జిబిషన్లకు అనుమతిస్తారు.

Related posts