తమిళనాడులో బంగారు నాణాలు బయటపడ్డాయి. కృష్ణగిరి జిల్లా హోసూరులో ఈ ఘటన జరిగింది. రోడ్డుపక్కన మట్టిదిబ్బల కింద బంగారు నాణేలు ఉన్నాయన్న సమాచారంతో… స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్న, పెద్ద తేడాలేకుండా దాదాపు 200 వందల మంది అక్కడికి చేరుకుని బంగారు నాణేల కోసం ఎగబడ్డారు. ఆ నాణాల కోసం తోపులాటలు, ముష్టి యుద్దాలకు దిగుతున్నారు. ఒక్కో నాణెం రెండు గ్రాములకు పైగా బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాటిపై అరబిక్ బాషలో లిపి ఉన్నట్లు గుర్తించారు.
దీంతో హోసూరు – బాగలూర్ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామయ్యింది. విషయం తెలుసుకున్న బాగలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్యలను క్రమబద్దీకరించారు. నాణాలపై హోసూర్ తహసీల్దార్ సెందిల్ కుమార్ మాట్లాడారు. ప్రజలకు దొరికిన కొద్ది నాణాలను స్వాధీనపరుచుకున్నామన్నారు. అయితే..వాటిని పరిశీలించగా అవి ఇత్తడి నాణాలుగా గుర్తించామని పేర్కొన్నారు తహసీల్దార్. ఇత్తడి నాణాలను చూసి జనాలు బంగారు నాణాలు అనుకున్నారని తెలిపారు. ఈ ఘటన హోసూరు ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.