telugu navyamedia
సామాజిక

గోడ ఆవేదన

నేను ఒకప్పుడు
తెరుచుకున్న మనసు కిటికీలా
ఉండేదాన్ని
ఇప్పుడు నేనేంటో నాకే తెలియట్లేదు
నేను మనిషికి మనిషికి అడ్డుగోడ నో
మనసుకి మనసుకి అంతరాయాన్నో
ఒకప్పుడు అందరికీ ఎంతో ఉపయోగంగా ఉండే దాన్ని
ఎంత గర్వంగా ఉండేదో
ముచ్చట్లకీ నేనే ఉండాలి
ఇల్లాలి వడియాలకీ నేనే కావాలి
పిల్లల ఆటలకీ నేనే తోడుండాలి
ఇప్పుడు
నాకు నేనే అడ్డుగోడగా ఉన్నానేమో
ఇప్పుడు నేను చాలా దుర్బేధ్యమయ్యాను
ఎంతలా అంటే మనిషి ని మనిషి కనుగొనలేనంతగా ఎదిగిపోయా
కానీ ఏం లాభం విలువ తరిగి
నా వెనక్కాల నేనే నక్కి పోతున్నా
ఒకప్పుడు
బయట ప్రపంచానికి విషయం అందించే సాధనాన్ని నేనే అని మురిసి పోయా
కానీ ఇప్పుడు నా ఒంటికి అంటుకున్న పోస్టర్ల విషయం నాకే తెలియట్లేదు
కాకపోతే ఒక తృప్తి
మూగ జీవాలకు నేనే ఆకలి తీరుస్తుంటా
ఒక విషయం చెప్పుకుంటే
సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది
ఇంకా నాకేదో విలువ ఉందనుకున్నారేమో
నా మీద రాశారు పాపం
ఇచ్చట మూత్రము పోయారాదు అని
చెప్పుకుంటే సిగ్గుచేటు
గుర్తుకు వచ్చి మరీ పోసేసి పోతున్నారు ఛీ…
పిరికి పిల్లి బుద్ధి కి కూడా నన్నే అడ్డు పెట్టుకోవాలా?
అది బుద్ధి లేని పిల్లి
ఏ పార్టీనైనా మార్చేస్తుంది
దాని బుద్ధికి మధ్యలో గోడని
నేను ఎందుకు?
చివరాఖరికి నా మీద వేసిన సున్నం విలువ కూడా నా కివ్వట్లేదు
వేస్తే తిరిగి రాదని
ఉమ్ములతోనే నా రంగు మార్చేస్తున్నారు
వారికి అవసరమైతే రక్షణ గోడ
అంటారు
లేకపోతే అడ్డు గోడ అని కూల్చేస్తారు
ఛీ గోడ జన్మ…ఎందుకున్నానో
అందరికీ అడ్డుగోడలా…

శైలజ మంగళంపల్లి

Related posts