telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గో లోకల్ బీ వోకల్… అల్లు శిరీష్ కొత్త నినాదం

Allu Sirish

కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గట్టి దెబ్బే కొట్టింది. మన దేశ ఆర్థిక వ్యవస్థ సైతం కరోనా దెబ్బకు కుదేలవుతోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మన దేశానికి చెందిన వ్యాపార వ్యవస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకే, దేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే నినాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఊపందుకుంది. విదేశీ ఉత్పత్తులను పక్కనబెట్టి మన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ కూడా ఇదే విషయం చెప్పారు. ఆయన ట్విట్టర్ ద్వారా “వీలైనన్ని ఎక్కువ ఇండియన్ బ్రాండ్స్‌ను వాడాలని, ప్రోత్సహించాలని నేను బలంగా నిర్ణయించుకున్నాను. ప్రపంచీకరణ కారణంగా అన్ని విదేశీ ఉత్పత్తులను వాడటం మానేయడం బహుశా వీలుపడదని నాకు కూడా తెలుసు. కానీ, వీలైనంత వరకు దేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం. భారతీయ ఉత్పత్తులను వాడటం ద్వారా మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి సహాయం చేయొచ్చు” అని అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సూపర్ మార్కెట్‌లో తాను కొన్ని దేశీ ఉత్పత్తులను కొనుగోలు చేశానని కూడా అల్లు శిరీష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘నేను సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన కొన్ని ఉత్పత్తులు ఇవే. అన్నీ భారతీయ బ్రాండ్లే. మనలో చాలా మంది దేశీ ఉత్పత్తులను వాడతారు. కానీ, ఈ విషయం బయట చెబితే చిన్న చూపుగా ఉంటుందని భావించి చెప్పరు. దేశీ ఉత్పత్తులు వాడటమే కాదు వాటి గురించి మన నోటితో చెప్పాలి. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. గో లోకల్ బీ వోకల్ (స్థానిక ఉత్పత్తులు కొనండి.. వాటి గురించి గొంతెత్తి చెప్పండి)’’ అని అల్లు శిరీష్ పేర్కొన్నారు. అల్లు శిరీష్ నినాదానికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

Related posts