telugu navyamedia
సామాజిక

మార్గశిరం… మహిమాన్విత మాసం

సృష్టికి మొదలేది..? ఈ ప్రశ్నకు బదులేది..? అని తర్కించుకుంటే… శక్తి స్వరూపిణి ఆది పరాశక్తే సృష్టికి ఆద్యం అని సమాధానం వస్తుంది. సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, త్రి జగన్మాతలను సైతం సృష్టించింది లలితా త్రిపుర సుందరీ మాతే. స్థితి, లయ కారకులైన హరి, హరులను కార్తీక, మార్గశి మాసాల్లో విశేషంగా ఆరాధిస్తారు.  ఈ పవిత్ర మాసం శివ, కేశవులిద్దరిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తాం. అయితే, ప్రధానంగా శివదేవునికి సంబంధించి పూజాదికాలు, అభిషేకాలు అధికంగా వుంటాయి. కార్తీకం అనంతరం వచ్చే పవిత్ర మాసం మార్గశిర మాసం. ఇది సంపూర్ణంగా సకల దైవారాధనా మాసం. శ్రీహరి సర్వోత్తమ దైవమని, సర్వ శాస్త్రాలు తెలయజేస్తుండగా, ఆ శ్రీమహవిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం మార్గశిర మాసం.

అఖిల జగాలకు అమ్మ, అమ్మలుగన్న అమ్మ…త్రి మూర్తులను, త్రి జగన్మాతలను సృష్టించిన జగన్మాత చరణారవిందాలకు ప్రణమిల్లి శరణము వేడితే భయాలు తొలుగుతాయి. జయాలు కలుగుతాయి.

18 శక్తిపీఠాల్లోని జగన్మాతలకు భక్తులు, అత్యంత మన: పూర్వకంగా చేసే ప్రార్థన..

లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా, ఓఢ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ, జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగల్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాశ్మీరేతు సరస్వతీ, అష్టాదశ పీఠాని యోగినా మపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వ శత్రువినాశనం, సర్వ హరం దివ్యం రోగ సర్వ సంపత్కరం శుభం

పొరుగు దేశం శ్రీలంకలో శాంకరీ దేవి ఆలయం నెలకొని వుంది. ఆ దేశ తూర్పు తీరంలోని ట్రిన్ కోమలిలో వున్న ఈ దేవాలయం పోర్సుగీసు దేశీయుల దండయాత్ర సమయంలో దెబ్బతిన్నట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. ఇక్కడ దేవీమాత ఆలయానికి గుర్తుగా ఒక పెద్ద స్తంభం దర్శనమిస్తోంది, ఈ సమీపంలో శివాలయం ఉండడం, ఆ పరిసరాల్లో కాళీ మందిరం ఉండడం…ఇవన్నీ శాంకరీ మాత ఆలయానికి సంబంధించిన గుర్తులుగా కనిపిస్తున్నాయి.

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో కామాక్షీ అమ్మవారు భక్తులు పూజలు అందుకొంటున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రద్యుమ్న పట్టణంలో శృంఖలా మాత, మైసూరు కౌంచ పట్టణంలో చాముండేశ్వరీ తల్లి ఆలయాలు నెలకొని వున్నాయి.Maha Vishnu Abode Painting by Vijayann Rajasabai

తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపూర్ లో జోగులాంబ మాత, శ్రీశైల పుణ్యక్షేత్రంలో భ్రమరాంబిక మాత భక్తుల పాలిట కల్పవల్లుల్లా వున్నారు. మహరాష్ట్ర కొల్లాపూర్ లో మహాలక్ష్మి మాతగా అమ్మవారు కరుణిస్తున్నారు. మహరాష్ట్ర నాందేడ్ జిల్లా మహార్, మాహుర్యంలో ఏకవీరికా దేవిగా, మధ్య ప్రదేశ్ ఉజ్జయినీలో మహాకాళిగా, ఏపీలోని పిఠాపురం పురుహూతికా క్షేత్రంలో పురుహూతికా మాతగా అమ్మవారు పూజలందుకుంటున్నారు.

ఒడిశాలో ఓఢ్యలో గిరిజా దేవిగా, ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామలో మాణిక్యాంబగా, అసోం గౌహతిలోని హరిక్షేత్రలో కామరూపగా, అలహాబాద్ ప్రయాగలో మాధవేశ్వరీ దేవిగా, హిమాచల్ ప్రదేశ్ జ్వాల క్షేత్రంలో వైష్ణవీ దేవిగా, గయలో మంగళ గౌరిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇక పరమ పావన పుణ్యక్షేత్రం.. సకల శుభాలు కలుగచేసి, సమస్త ముక్తిని ప్రసాదించే వారణాసిలో విశాలాక్షి అమ్మవారుగా కటాక్ష వీక్షణాలు ప్రసరిస్తున్నారు. భారత దేశ మకుటాయమాన స్థానంలో వున్న కాశ్మీర్ లో సరస్వతీ మాత భక్తులను కటాక్షిస్తున్నారు. ఇక్కడి వాగ్దేవి అమ్మవారిని కీర్ భవాని అని పిలుస్తారు.

మంచు వానలతో ముంచెత్తే హిమగిరి సొబగుల మాదిరి ప్రకృతి మాత దర్శనమిచ్చే రుతువు హేమంత రుతువు. ఆరు రుతువుల్లో ఆహ్లాదకరం కల్గించే రుతువు ఇది. శ్రీమహా విష్ణువును ఆరాధించే మార్గశిర మాసంలో…దేవ దేవుని తులసీ దళాలతో పూజించడం ఎంతో పుణ్యప్రదం. ఈ మాసంలో ..ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర పఠనం సర్వశుభాలు కలుగచేస్తుంది.

Related posts