telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 లో ఆ జట్టుకు ఆడాలని ఉంది : మ్యాక్స్వెల్

kohli on maxwell short leave to cricket

ఐపీఎల్‌ 2021‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున ఆడాలని ఉందని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీతో కలిసి బ్యాటింగ్‌ చేయడం ఇష్టమని, అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఐపీఎల్‌ 2021 కోసం ఈ రాజు చెన్నైలో బీసీసీఐ మినీ వేలంను నిర్వహించనున్న విషయం తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడిన గ్లెన్‌ మాక్స్‌వెల్ ఈసారి ఆర్సీబీతో ఆడేందుకు సిద్ధమని చెప్పాడు. తనకిష్టమైన ఏబీ డివిలియర్స్‌, విరాట్ కోహ్లీతో పనిచేయడం సంతోషమన్నాడు. వాళిద్దరితో తనకు మంచి అనుబంధం ఉందని, కోహ్లీతో బాగా కలిసిపోతానని మ్యాక్సీ పేర్కొన్నాడు. ‘కోహ్లీ సారథ్యంలో ఆడటం, అతడితో కలిసి బ్యాటింగ్‌ చేయడం నాకెంతో ఇష్టం. ఎందుకంటే అతడితో త్వరగా కలిసిపోతా. ఎప్పుడు కలిసినా విరాట్ ఏదో ఒక విషయంలో సాయపడుతుంటాడు. అతడో అత్యుత్తమ క్రికెటర్‌. కాబట్టి కోహ్లీతో కలిసి ఆడటం చాలా బాగుంటుంది’ అని అన్నాడు. గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020 టోర్నీలో కింగ్స్ పంజాబ్‌ తరఫున ఆడిన గ్లెన్‌ మాక్స్‌వెల్ 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేశాడు. సిక్సర్ల కింగ్ అని పేరున్న మ్యాక్సీ.. టోర్నీ ఆసాంతం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. రూ.10.75 కోట్లు వెచ్చించి మరీ తీసుకున్న ఆ జట్టు అంచనాలను పూర్తిగా తలకిందులు చేశాడు. దీంతో అతడి ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పంజాబ్‌ తర్వాతి సీజన్‌కు అతడిని వదిలేసింది.

Related posts