నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్, ఉల్లంఘనలను నియంత్రించేందుకు పోలీసులు సరికొత్త ప్రయత్నాలు సత్ఫాలితాలు ఇస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో వాహనదారులను మరింత ప్రోత్సహించేందుకు ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ముందుకొచ్చారు. ట్రాఫిక్ నియమాలను తు.చ. తప్పకుండా పాటించే వారికి సినిమా టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో వాహనదారులకు సినిమా టికెట్లు అందించి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
పెండింగ్ చలాన్లు లేకుండా, ట్రాఫిక్ నియమాలను చక్కగా పాటిస్తున్న వాహనదారులను గుర్తించి టికెట్లు అందజేశారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. వాహనదారుల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన గతంలో పోలిస్తే బాగా పెరిగిందన్నారు. గతంతో 30 శాతం మంది ద్విచక్ర వాహనదారులే హెల్మెట్ వాడేవారని, ఇప్పుడు 90 శాతం మంది వాడుతున్నారని తెలిపారు.