telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మొదలైన గ్రేటర్‌ వార్‌.. హైదరాబాద్‌లో ఉత్కంఠ

హైదరాబాదీలతో పాటు తెలంగాణ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు 150 డివిజన్లలో పోలింగ్‌ జరగనుంది.  కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు అమలు చేయనున్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో మార్కింగ్‌ వేశారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఓటుహక్కు వినియోగించుకోవాలంటే ఎస్‌ఈసీ ప్రకటించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల కోసం 60 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు, 30 పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. టీఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో ఓటరు స్లిపులు డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు పోలింగ్‌ కేంద్రం లొకేషన్‌ను సైతం తెలుసుకోవచ్చు.  మొబైల్‌యాప్‌లో, మైజీహెచ్‌ఎంసీ యాప్‌లో పోలింగ్‌ స్టేషన్‌ లొకేషన్‌ను తెలుసుకునే వెసులుబాటు ఉంది. 2,272 కేంద్రాలను లైవ్‌ వెబ్‌ క్యాస్టింగ్‌తో పర్యవేక్షిస్తారు. 

గ్రేటర్ పరిధిలో మొత్తం ఓటర్లు 74 లక్షల 44 వేల 260 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 38 లక్షల 76 వేల 688 కాగా… స్త్రీలు 35 లక్షల 65 వేల 896. ఇతరులు 676 మంది ఉన్నారు. మొత్తం వార్డుల సంఖ్య 150 కాగా…1122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 18 ఏళ్ల తర్వాత బల్దియా పోరులో బ్యాలెట్‌ ఉపయోగిస్తున్నారు. ఈసారి గ్రేటర్‌ ఎన్నికల్లో రూల్స్‌ కూడా మారిపోయాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఫ్రీగా తిరగడానికి అవకాశం లేదు. తమ డివిజన్‌ పరిధిలోనే ఉండాల్సి ఉంటుంది. ఇక, కొండాపూర్ డివిజన్‌లో అత్యధికంగా 99 పోలింగ్ కేంద్రాలుండగా… రామచంద్రాపురంలో అత్యల్పంగా 33 కేంద్రాలున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరగనుంది. మొత్తంగా 28 వేల 683 బాక్సులు ఉపయోగిస్తున్నారు. టీఎర్ఎస్ 150, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106, ఎంఐఎం51,సీపీఐ 17, సీపీఎం12, ఇతరులు 49 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్ని‌కల్లో ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పు ‌తో‌పాటు తప్పని‌స‌రిగా ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉండాలని రాష్ట్ర ఎన్ని‌కల సంఘం స్పష్టం‌ చే‌సింది. అయితే ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ఇతర గుర్తింపు పత్రాలు చూపి తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఎన్నికల సంఘం 18 రకాల కార్డులను గుర్తించింది. ఓటు వేసేటప్పుడు ఇందులో ఏదో ఒక కార్డు చూపించవచ్చు. 

Related posts