telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు గంటా..హాట్ టాపిక్‌

గత రెండేళ్లగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ‌స్తున్న టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజ‌రుకావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయవేటీకరణను నిరసిస్తూ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు. అయితే రాజీనామాను ఇంకా స్పీకర్ ఆమోదించలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబు అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా గంటా శ్రీనివాసరావు హాజరుకాలేదు.

అలాంటిది ఈరోజు మాజీ మంత్రి గంటా, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, గండి బాబ్జి, కార్యకర్తలు బీచ్ రోడ్‌లోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ… 1982 తెలుగు వారికి మరుపురాని సంవత్సరం అని.. ఆనాడు ఇదే రోజున ఎన్టీఆర్ పార్టీని స్థాపించి తెలుగు వారి సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటారని అన్నారు.

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో పార్టీ ముందుకు తీసుకొని వెళ్లారని తెలిపారు. ఎన్టీఆర్ అనేది ఓ వైబ్రేషన్ అని.. ఆయన చనిపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి అని అన్నారు. రాజకీయ పార్టీలకు ఆయన ఓ రోల్ మోడల్… ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన ఘనత ఎన్టీయార్ దే అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Related posts