telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్‌ పూర్తి చేయ‌గ‌ల‌మా లేదా అనేది తెలియదు : గంగూలీ

త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఐపీఎల్ 2021 టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది. అయితే మిగిలిన లీగ్ ఎప్పుడు, ఎక్క‌డ నిర్వ‌హిస్తారు.. ఇంతకు టోర్నీ సాధ్య‌మేనా అన్న సందేహాలు అందరి మదిలో మెదులుతున్నాయి. దీనిపై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ స్పందించారు. ఐసీసీ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ త‌ర్వాత మిగతా ఐపీఎల్ 2021 మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారా అని సౌర‌వ్ గంగూలీని ప్ర‌శ్నించ‌గా.. ‘అది ఇప్పుడు సాధ్యం కాదు. భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళుతోంది. కరోనా వైరస్ కారణంగా 14 రోజుల క్వారంటైన్‌లాంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఐపీఎల్ 2021 మ్యాచులు భారత్‌లో అస‌లు కుద‌ర‌దు. ఈ క్వారంటైన్ చాలా క‌ష్టం. ఐపీఎల్‌ను పూర్తి చేయ‌గ‌ల‌మా లేదా అన్న‌ది ఇప్పుడే ఏమీ చెప్ప‌లేము. విదేశీ ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉండాలి. విదేశీ జట్ల షెడ్యూల్ కూడా చూసుకోవాలి. ఇలా చాలా విషయాలను మేము పరిగణలోకి తీసుకోవాలి’ అని అన్నారు. ‘ఇంగ్లిష్ ప్రిమియ‌ర్ లీగ్‌లోనూ కరోనా కేసులు వ‌చ్చాయి. అయినా వాళ్లు లీగ్‌ను కొన‌సాగించారు. ఐపీఎల్ టోర్నీ మాత్రం అలా కాదు. వారం పాటు ఆపితే.. ఇక అంతే. ప్లేయ‌ర్స్ ఇళ్ల‌కు వెళ్లిపోతారు. విదేశీ ఆటగాళ్లు విషయంలో ఆలోచించాలి. ప్లేయర్స్ మ‌ళ్లీ వస్తే.. క్వారంటైన్ ఉంటుంది. ఇలా అన్నీ మొద‌టి నుంచీ మొద‌ల‌వుతాయి. ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లను పూర్తి చేయడంపై ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని’ అని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయ‌ప‌డ్డారు.

Related posts