telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ జరగకపోతే ఎంత నష్టమో చెప్పిన గంగూలీ…

ఐపీఎల్ లో పలు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడుతుండడంతో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ మంగళవారం నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల లీగ్‌ చరిత్రలో ఇలా అర్ధాంతరంగా ముగియడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌ 9న ఆరంభమైన 2021 సీజన్‌లో మొత్తం 60 మ్యాచ్‌లకు గాను 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ప్రస్తుత కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్ కారణంగా ప్రస్తుతం బిజీ షెడ్యూల్ ఉన్న కేలెండర్‌లో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను పూర్తిచేసేందుకు అవసరమైన టైమ్ స్లాట్ దొరకడం కష్టమైన పనేనని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. టోర్నీలోని మిగతా మ్యాచ్‌లను కనుక నిర్వహించకుంటే జరిగే నష్టం రూ. 2 వేల కోట్లకు పైమాటేనని పేర్కొన్నారు. ఇక సీజన్‌ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్ల నుంచి రావాల్సిన ఆదాయానికి పెద్ద గండి పడింది. ‘ఐపీఎల్‌ 2021ను వాయిదా వేసి కొన్ని రోజులు మాత్రమే అయింది. టీ20 ప్రపంచకప్‌నకు ముందు లీగ్‌లోని మిగతా మ్యాచ్‌లను పూర్తి చేసేందుకు విండో అందుబాటులో ఉందో లేదో చూడాలి. ఇతర బోర్డులతోనూ మాట్లాడాలి. ఇలా ఐపీఎల్ నిర్వహణపై ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కదానిపై చర్చించాల్సి ఉంది. ఐపీఎల్ వాయిదా పెద్ద ఎదురుదెబ్బ అని అనుకోవడం లేదు అన్నారు.

Related posts