బ్యానర్ : 14 రీల్స్ ప్లస్
నటీనటులు : వరుణ్ తేజ్, అథర్వ, పూజా హెగ్డే, మృణాళిని రవి, బ్రహ్మాజీ, డింపుల్ హయతి, సుబ్బరాజు తదితరులు
దర్శకత్వం: హరీశ్ శంకర్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
సంగీతం : మిక్కీ.జె.మేయర్
రచన : హరీశ్ శంకర్, కార్తిక్ సుబ్బరాజ్ (మూలకథ)
తమిళ్ హిట్ సినిమా “జిగర్తాండ”కు రీమేక్ గా తెరకెక్కిన “వాల్మీకి” చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన “వాల్మీకి” సినిమా టైటిల్ మారింది. సినిమా టైటిల్‌ను “గద్దలకొండ గణేష్”గా మార్చారు. “వాల్మీకి” టైటిల్ అభ్యంతరకరంగా ఉందని బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో దర్శకనిర్మాతలకు సినిమా టైటిల్ మార్చక తప్పలేదు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ :
అభి (అధర్వ)కు సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం. జర్నలిస్ట్ అయిన తన బాబాయ్ సహాయంతో ప్రముఖ దర్శకుడి దగ్గర దర్శకత్వశాఖలో చేరుతాడు. కానీ ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా సెట్లో అభికి అవమానం జరగగా… ఏడాది తిరిగేలోపు సినిమా చేస్తానని ఆ దర్శకుడితో సవాలు విసురుతాడు అభి. మంచి సినిమా తీయాలనే ఆలోచనతో నేర చరిత్ర ఉన్న వాళ్ల కోసం జైళ్ల చుట్టూ తిరుగుతుంటాడు. అలా గద్దలకొండలో ఓ వ్యక్తి ఉన్నాడని తెలుసుకుని, అక్కడికి అభి వెళ్లేలోగా అతన్ని గద్దలకొండ గణేష్ (వరుణ్‌తేజ్) హత్య చేస్తాడు. గణేష్ రౌడీ అని తెలుసుకున్న అభి అతని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి… అభికి కాస్త దగ్గరైన బుచ్చమ్మ (మృణాళిని)ని ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. గణేష్ జీవిత కథతో “సీటీమార్” అనే సినిమా చేస్తాడు. ఆ సినిమా షూటింగ్‌లో ఉండగా గణేష్‌కి బుచ్చమ్మ మీద ఇష్టం పెరుగుతుంది. అయితే అప్పటికే అభితో ప్రేమలో పడుతుంది బుచ్చమ్మ. విషయం తెలుసుకున్న గణేష్ అప్పుడు ఏం చేశాడు ? వాళ్ళిద్దరినీ చంపేశాడా ? అసలు గణేష్ గత జీవితం ఏంటి ? చివరికి ఏం జరుగుతుంది ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు :
గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ గెటప్ బాగుంది. అతని ఎత్తు, ఉంగరాల జుట్టు, పెద్ద గడ్డం ఈ పాత్రకు కరెక్ట్ గా సరిపోయాయి. కుడి కంటికింద గాటు, దానికో స్టోరీ, తెలంగాణ యాస డైలాగులు… ఈ పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. శ్రీదేవి పాత్రలో కనిపించింది కొద్దిసేపే అయినా పూజా హెగ్డే ఆకట్టుకుంది. అధర్వకి తెలుగులో తొలి సినిమా అయినా తన నటనతో ఆకట్టుకున్నాడు. మృణాళిని అల్లరి పిల్లగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తనికెళ్లభరణి చెప్పే డైలాగులు బాగున్నాయి. బ్రహ్మాజీ, డింపుల్ హయతి, సుబ్బరాజు, మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు హరీష్ శంకర్ ఒరిజినల్ స్టోరీకి మార్పులు చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు సమయం అనుకూలించిన ప్రతి చోటా తన మార్కు డైలాగులను చెప్పించాడు. ముఖ్యంగా “ఎల్లువొచ్చి గోదారమ్మ” పాటను ప్రత్యేకంగా చెప్పాలి. కానీ ఈ పాటను ఇంకా బాగా తీయాల్సిందేమోనని అన్పిస్తుంది. కానీ ఆ పాటలో వరుణ్, పూజా మాత్రం అదరగొట్టారు. అధర్వ, మృణాళిని మధ్య ప్రేమ సన్నివేశాలు కొన్నిచోట్ల పేలవంగా అనిపించాయి. సంగీతం, నేపథ్య సంగీతం బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి.
రేటింగ్ : 2.5/5