telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

గోవా సీఎం పారికర్ మృతి.. నేడు అంత్యక్రియలు.. అప్పుడే తదుపరి సీఎంపై కసరత్తు..

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతూ, సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వైద్య సేవలు పొందారు. గతరాత్రి ఆయన మృతి చెందారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి బీజేపీ కార్యాలయంలో మనోహర్‌ పారికర్‌ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. కంఫాల్‌లో ప్రజా సందర్శనకు గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ పార్ధివదేహాన్ని ఉంచనున్నారు. సాయంత్రం కంఫాల్‌ ఎస్‌ఏజీ గ్రౌండ్‌లో పారికర్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

goa cm parikar serious health issueఆయన మరణ వార్త తెలిసిన కొన్ని గంటల్లోనే భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి చేరుకున్నారు. భాగస్వామ్య పక్షాలతో కలిసి రాత్రి పొద్దుపోయే దాకా చర్చలు జరిపారు. కానీ స్పష్టత రాలేదని డిప్యూటీ స్పీకర్‌ మైకేల్‌ లోబో తెలిపారు. సంకీర్ణ పక్షమైన మహారాష్ట్రవాదీ గోమంటక్‌ పార్టీ నేత సుదిన్‌ ధావలికర్‌ తననే సీఎం చేయాలని పట్టుబడుతున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు భాజపా శాసనసభ్యులు కూడా పార్టీ నుంచే అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుతుండడంతో విషయం ఓ కొలిక్కి రాలేదన్నారు.

భాగస్వామ్య పక్షమైన గోవా ఫార్వర్డ్‌ పార్టీ అధినేత విజయ్‌ సర్‌దేశాయ్‌ కూడా భాజపా అధినాయకత్వంతో సంప్రదింపులు జరిపుతున్నారు. ”సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను వారితో చర్చించాం. అయితే ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. మా ప్రతిపాదనలు వారి ముందు ఉంచాం, వాటిపై వారు స్పందించాల్సి ఉంది. మా పార్టీ ఇంతకాలం మనోహర్‌ పారికర్‌కు మద్దతు పలికింది. భాజపాకు కాదు” అని సర్‌దేశాయ్‌ వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భాజపాకు సొంతంగా 12 మంది శాసనసభ్యులుండగా మిత్రపక్షాలతో కలిపి 20 మంది బలం ఉంది. 14 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది.

Related posts