telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. పేదలందరికీ .. ఉచిత వైద్యం..

huge job notification in telanganaf

వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రంలోని పేదలందరికీ రూపాయి ఖర్చు లేకుండానే ఉచిత వైద్యం అందించడం సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. నల్లగొండ జిల్లా నందికొండ(నాగార్జునసాగర్) మున్సిపాలిటీలో రూ.18కోట్ల వ్యయంతో నిర్మించిన కమలానెహ్రూ వంద పడకల దవాఖానాను విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి కుంటుపడుతుందని ఆంధ్ర పాలకులు అపోహలను సృష్టించారన్నారు. తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటాయని, ఎడారిగా మారుతుందని అన్న వలసపాలకుల కుట్రను ఛేదించిన సీఎం కేసీఆర్ అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని చెప్పారు.

సుఖ ప్రసవాలు పెంచాలనే లక్ష్యంతో దవాఖానలు తీర్చిదిద్ది కేసీఆర్ కిట్‌తోపాటు అమ్మఒడి పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణులకు పోషకాహారంతో పాటు రూ.12 వేలు నగదును ఖర్చు పెడుతున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలుకానీ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయన్నారు. ఆడబిడ్డ నెలతప్పితే, డెలివరీ వరకు అయ్యే ఖర్చులు తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. కార్పొరేట్ వైద్యాన్ని రాష్ట్ర రాజధానిలో కాకుండా జిల్లా కేంద్రాల్లో అందించే విధంగా నల్లగొండ, సూర్యాపేటల్లో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశామని, అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఆరోగ్యశ్రీ, జీహెచ్‌ఎస్ వైద్య సేవలను ప్రారంభిస్తామని తెలిపారు.

రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వ దవాఖానాలో అన్ని వైద్యసేవలు అందుతాయన్నారు. వ్యవసాయరంగానికి 24గంటల ఉచిత విద్యుత్ సహా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి గత పాలనలో రైతులు పడ్డ కష్టాలన్నీ తీర్చారన్నారు. జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ మాదిరిగా 24 గంటల ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వడంలేదో సమాధానం చెప్పాలని మంత్రి ఈటల ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు కమీషన్ల యావ తప్ప ప్రజల కష్టాలు పట్టవని మండిపడ్డారు.

Related posts