telugu navyamedia
రాజకీయ

కిమ్-ట్రంప్ సమావేశం.. ఉచితంగా హెయిర్ కట్.. !!

free Trump, Kim haircuts
హెయిర్ కట్ అంటే ఎవరైనా ఏ హీరో స్టయిల్ లో చేయించుకోవడం నేడు ఫాషన్. అయితే ఒక దేశ అధ్యక్షుడి తరహా చేయించుకోవడం అక్కడి వారికి ఇష్టమేమో.. అదికూడా ఉచితంగా చేస్తా అంటున్నాడు వియత్నాంకు చెందిన హెయిర్ డ్రెస్సర్‌. కానీ, కిమ్, ట్రంప్ హెయిర్ కట్ మాత్రమే ఉచితంగా చేస్తాడట. అయినా సరే అంటూ అక్కడి వారు బారులు తీరుతున్నారు. ఇక చూడటానికి, ఉత్తర కొరియా అధ్యక్షుడి తలకట్టు కాస్త విచిత్రంగా ఉంటుంది. చెవుల పైకి ఉన్న జుట్టును శుభ్రంగా తీసివేసి, నడినెత్తిన మాత్రం ఒత్తుగా ఉండేలా ఆయన కటింగ్ ఉంటుంది. ఉచిత హెయిర్ కట్ కి కారణం ఉందిలేండి. 
ఫిబ్రవరి 27-28తేదీల్లో వియత్నాం రాజధాని హనోయ్‌లో ట్రంప్‌-కిమ్ సమావేశం జరగనుంది. ఎవరైనా వారి తలకట్టు తీరు కావాలనుకుంటే ఉచితంగా చేస్తానని వెల్లడించాడు. ఈ సమావేశం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అధికారులు, మీడియా సిబ్బంది ఇక్కడికి రానుండటంతో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హనోయ్‌కు చెందిన హెయిర్ డ్రెస్సర్‌ లీ తువాన్‌ దువాంగ్ ఈ కొత్త పద్ధతిని ఎంచుకున్నాడు. అలాగే తాను ఈ సమావేశానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాడు.
ఇక నిర్వాహకుడు మాట్లాడుతూ, ‘దీన్ని సరదాగానే మొదలుపెట్టాను. కానీ వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయాను. నాకు మొదటి నుంచి శాంతి బాటనే ఇష్టం. యుద్ధానికి వ్యతిరేకిని. వియత్నాం యుద్ధం కారణంగా నా కుటుంబ సభ్యుల్లో చాలా మందిని కోల్పోయాను. అందుకే ఈ సమావేశానికి మద్దతు తెలుపుతున్నా’ అని వెల్లడించాడు. తమ నాయకుడి పట్ల అవమానకర ఘటనలు జరిగితే ఉత్తర కొరియా అస్సలు సహించదు. 2014లో ఆయన తలకట్టు తీరును ఉద్దేశిస్తూ ‘బ్యాడ్ హెయిర్ డే’ అని పదాన్ని వాడగా ఆ దేశ ఎంబసీ అధికారులు లండన్‌ హెయిర్‌ డ్రెస్సర్‌ మీద ఫిర్యాదు చేశారు.
అమెరికా, ఉత్తర కొరియా మధ్య గతంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. కొంతకాలంగా ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే ప్రక్రియలో భాగంగా ఆ దేశాల అధ్యక్షులు గత సంవత్సరం సింగపూర్‌లో సమావేశం అయ్యాయి. ఇప్పుడు మరోసారి వియత్నాం అందుకు వేదిక కానుంది.

Related posts