telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రస్థానం

Pranab Mukharjee

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కరోనా బారిన పడిన ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో కోద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రణబ్‌కు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ తరవాత అస్వస్థతకు గురవడంతో ఆయన ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత కోమాలోకి, చివరకు డీప్ కోమాలోకి వెళ్లిన ఆయన కొన్ని గంటల క్రితమే సెప్టిక్ కోమాలోకి వెళ్లారు. చివరకు తుదిశ్వాస విడిచినట్టు వెల్లడించారు. తాజాగా ప్రణబ్ ముఖర్జీ మృతి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ప్రణబ్ కుమార్ ముఖర్జీ భారతదేశానికి 2012 నుండి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో అతను భారత జాతీయ కాంగ్రెస్లో సీనియర్ నాయకునిగా ఉన్నాడు. కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు.రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటిరారని రాజకీయ పక్షాలు అంటూంటాయి.

వ్యక్తిగత జీవితం…

ప్రణబ్ ముఖర్జీ డిసెంబరు 11, 1935న పశ్చిమ బెంగాల్ లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీ గ్రామంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి కమద కింకర ముఖర్జీ భారత స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీల సభ్యుడు. అతని తండ్రి 1952 నుండి 1964 వరకు పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యునిగా, ఎ.ఐ.సి.సి సభ్యునిగా ఉన్నాడు. అతని తల్లి రాజ్యలక్ష్మీ ముఖర్జీ. అప్పటి కాలంలో కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సూరి (బిర్భుమ్) లోని సూరి విద్యాసాగర్ కళాశాలలో చదివాడు. తరువాత రాజనీతి శాస్త్రం, చరిత్రలో ఎం.ఎ. చేసాడు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి డిగ్రీని పొందాడు. అతను 1963 లో కలకత్తా లోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (తపాలా, టెలిగ్రాఫ్) కార్యాలయంలో అప్పర్ డివిజనల్ క్లర్క్ (యు.డి.సి) ఉద్యోగంలో చేరాడు. తరువాత విద్యానగర్ కళాశాలలో రాజనీతి శాస్త్రం బోధించే అధ్యాపకునిగా విధులను నిర్వర్తించాడు. ప్రణబ్ రాజకీయాలలోనికి రాక పూర్వం దేషెర్ దక్ పత్రికకు జర్నలిస్టుగా ఉండేవాడు.
Pranab Mukharjee

రాజకీయ జీవితం

1969 లో మిడ్నాపూర్ ఉప ఎన్నికకు సంబంధించిన రాజకీయ ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి వి. కె. కృష్ణ మేనన్కు ప్రచార బాధ్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం ప్రారంభమయింది. 1969లో జరిగిన కాంగ్రెస్ సభలో అతను బంగ్లా కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రసంగించాడు. ఆ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముగ్ధురాలైపోయింది. అతని తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడని, కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశాడని తెలుసుకున్న ఆమె ఒక ఏడాది ముగిసే లోపే అతనికి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యే అవకాశం కల్పించింది. ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకడైనందున అతను 1973 లో కేంద్ర ప్రభుత్వంలో స్థానం పొందాడు. 1976 –77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితిలో జరిగిన దురాగతాల విషయంలో కాంగ్రెస్ పార్టీలోను మిగతా కాంగ్రెసు నాయకుల వలెనే అతను కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. అనేక మంత్రి స్థాయి పదవులు నిర్వర్తించిన ముఖర్జీ సేవలు 1982–84 లో తొలిసారిగా ఆర్థిక మంత్రిగా పని చెయ్యడంతో ముగిసాయి. 1980–85 లో రాజ్యసభ నాయకునిగా పని చేశాడు.

1973లో కేంద్ర కేబినెట్‌లో అడుగు పెట్టిన ప్రణబ్‌ నెహ్రూ కుటుంబంలోని మూడు తరాల నేతలకు సన్నిహితుడు. ఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగినా రాజీవ్‌ గాంధీ హయాంలో కొద్దికాలం పార్టీకి దూరమయ్యాడు. 1984 లో ఇందిరా గాంధీ హత్య తరువాత భారత ప్రధానిగా ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని రాజీవ్ గాంధీని సూచించడం సరికాదని భావించాడు. ప్రధానమంత్రి పదవి పోరాటంలో ముఖర్జీ ఓడిపోయాడు. రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నాడు. 1989లో తిరిగి రాజీవ్‌గాంధీతో రాజీ కుదరడంతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. 1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగిన తరువాత అనూహ్య రాజకీయ పరిణామాలతో పి.వి.నరసింహారావు ప్రధాని కావడంతోనే ప్రణబ్‌కు పూర్వ వైభవం వచ్చింది. 1991లో ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా ప్రణబ్‌ను నియమించిన పి.వి.నరసింహారావు 1995లో విదేశీ వ్యవహారాల శాఖను కట్టబెట్టాడు. అంతకు ముందు పరిశ్రమల శాఖా మంత్రిగా పనిచేసిన ప్రణబ్‌ అప్పటి నుంచీ కేబినెట్‌లోని అన్ని కీలక శాఖల్లో సమర్ధవంతంగా పనిచేశాడు. సోనియా రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే ఆమె విదేశీయత గురించి కొందరు వేలెత్తి చూపగా ప్రణబ్ మాత్రం సోనియాకు అండగా నిలిచాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు.
Pranab Mukharjee

అందుకే 2004లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ కూటమి అధికారంలోకి రాగానే, అతను మొదటి సారి లోక్‌సభకు ఎన్నికైనాడు. ప్రభుత్వంలో కీలకమైన రక్షణశాఖకు మంత్రిగా సేవలనందించాడు. అప్పటి నుండి అతను 2012లో తాను రాజీనామా చేసేవరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రెండవ స్థానంలో ఉన్నాడు.

అతను అనేక కీలకమైన కేబినెట్ మత్రిత్వ పదవులను చేపట్టాడు. రక్షణ శాఖా మంత్రి (2004–06), విదేశీ వ్యవహారాల మంత్రి (2006–09), ఆర్థిక మంత్రి (2009-12)గా తన సేవలనంచించాడు. అతను లోక్‌సభకు నాయకునిగా కూడా పని చేసాడు. జూలై 2012 న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (యు. పి. ఎ) అతనిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అతను రాష్ట్రపతి ఎన్నికలలో 70 శాతం ఎలక్టోరల్ కాలేజి వోట్లను పొంది ప్రత్యర్థి పి.ఎ.సంగ్మాను ఓడించాడు.

2017లో ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికలలో మరలా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. వయసు పైబడినందున ఆరోగ్య సమస్యలరీత్యా రాజకీయాల నుండి పదవీ విరమణ చేయాలని భావించాడు. అతని రాష్ట్రపతి పదవీ కాలం 2017 జూలై 25 న ముగిసింది. అతని తరువాత రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నికయ్యాడు.
ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
ప్రణబ్ ముఖర్జీ మృతిపై కేసిఆర్ దిగ్భ్రాంతి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

Related posts