telugu navyamedia
క్రీడలు వార్తలు

చెన్నై టీమ్ ‌మేనేజ్‌మెంట్ ‌పై భారత మాజీ క్రికెటర్ విమర్శలు…

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై భారత మాజీ క్రికెటర్, తెలుగు కామెంటేటర్ వెంకటపతి రాజు విమర్శలు గుప్పించారు. అసలు కేదార్ జాదవ్‌ను జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్లతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ చెబుతూ జాదవ్‌ ఆటతీరును విమర్శించారు. ‘వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కేదార్ జాదవ్‌కు ఎందుకు అవకాశాలు కల్పిస్తున్నారు. అసలు టీమ్‌లో అతని పాత్ర ఏంటో? బ్యాటింగ్ చేయడు.. బౌలింగ్ చేయలేడు. యువ ఆటగాళ్లు రుతురాజ్, జగదీశన్‌లను పక్కన పెట్టి మరీ జాదవ్‌కు సీఎస్‌కే వరుస అవకాశాలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘అని ధోనీ వ్యూహాలను తప్పుబట్టారు.

ఇక ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి 62 పరుగులు చేసిన జాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో బౌలింగే చేయని కేదార్, చురుకైన ఫీల్డర్‌ కూడా కాదు. అయినా చెన్నై 10 మ్యాచ్‌లు ఆడగా, 8 మ్యాచ్‌లలో అతనికి అవకాశం లభించింది. సోమవారం మ్యాచ్‌లో మరో 14 బంతులు మిగిలి ఉన్న సమయంలో ఏడో స్థానంలో అతను బ్యాటింగ్‌కు వచ్చాడు. అతి కష్టమ్మీద 7 బంతుల్లో 4 పరుగులు చేయగలిగాడు. ఎప్పుడూ ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడే జాదవ్, చివరి ఓవర్లో జడేజాతో పాటు రెండో పరుగు తీయలేక కూర్చుండిపోయాడు. 2018 వేలంలో ఏకంగా రూ. 7.8 కోట్లకు చెన్నై అతడిని తీసుకుంటే ఒక్కటే మ్యాచ్‌ ఆడి గాయంతో దూరమయ్యాడు. 2019లో కూడా 12 ఇన్నింగ్స్‌లు ఆడినా చేసింది 162 పరుగులే. అయినా అతనికి అవకాశాలు ఇవ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts