telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

గుండెపోటుతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్ మృతి

Dean Jones

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌ గుండెపోటుతో ఈరోజు మరణించారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ల్లో భాగంగా బ్రాడ్‌కాస్టింగ్‌ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్‌ ముంబైలో ఉన్నారు. గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా తీవ్ర గుండెపోటుకు గురైన జోన్స్‌ తుదిశ్వాస విడిచారు. ఆసీస్‌ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలను జోన్స్‌ ఆడారు. తన క్రికెట్‌ కెరీర్‌ ముగిసిన తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తారు. జోన్స్‌ మృతిని ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ ధృవీకరించింది. “జోన్స్‌ ఇకలేరు. ఇది చాలా విషాదకరమైన ఘటన. ఈ వార్తను షేర్‌ చేయడం కలిచి వేస్తోంది. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో జోన్స్‌ ప్రాణాలు విడిచారు. ఆయన మృతికి నివాళులర్పిస్తున్నాం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. ఆయన మృతదేహాన్ని ఆస్ట్రేలియాకు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మేము ఆస్ట్రేలియా హై కమిషన్‌తో టచ్‌లో ఉన్నాం. జోన్స్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దక్షిణాసియాలో క్రికెట్‌ అభివృద్ధి చెందడానికి జోన్స్‌ ఎంతో కృషి చేశారు. ఈ గేమ్‌కు ఆయనొక గొప్ప అంబాసిడర్‌. ఆయనకు క్రికెట్‌ అంటే ప్రాణం. ఎప్పుడూ యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ముందుండే వారు. కామెంటరీలో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఒక చాంపియన్‌ కామెంటేటర్‌. జోన్స్‌ కామెంటరీకి లక్షలాది అభిమానులున్నారు. ఆయన్ని మాతో పాటు ఫ్యాన్స్‌ కూడా మిస్సవుతున్నందుకు చింతిస్తున్నాం” అని స్టార్‌ స్పోర్ట్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Related posts