మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీకి సర్వం సిద్దం చేశారు. బత్తిని సోదరులు ఏటా అందించే చేప మందు పంపిణీకి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చేప మందు పంపిణీ కోసం మత్స్య శాఖ 1.60 లక్షల కొరమీను చేప పిల్లలను అందజేసింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఉబ్బస వ్యాధిగ్రస్తులకు చేప మందును పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
శనివారం సాయంత్రం 4.30 గంటలకు దూద్‌బౌలిలోని స్వగృహంలో సత్యనారాయణస్వామి వ్రతం, బావి పూజ తర్వాత చేప ప్రసాదం తయారీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు దూద్‌బౌలిలో, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏకకాలంలో ఆస్తమా రోగులకు పంపిణీ చేస్తారు. చేప మందు కోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్శారు.