telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

నేడు మొదటి .. ప్లే ఆఫ్ మ్యాచ్..

first playoff today on ipl 2019

ఐపీఎల్‌ ప్లే ఆఫ్ నేటితో ప్రారంభం. నేడు జరిగే క్వాలిఫయర్‌-1లో మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌.. రోహిత్‌ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్‌తో తలపడుతుంది. రెండు జట్లూ బలమైనవే. రెండింటికీ ఘన చరిత్రే ఉంది. చెరో మూడు సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ను గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రెండు స్థానాలతో లీగ్‌ దశలను ముగించిన ముంబయి, చెన్నై మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.

తుది జట్లు (అంచనా) :
చెన్నై: వాట్సన్‌, డుప్లెసిస్‌, రైనా, అంబటి రాయుడు, ధ్రువ్‌ షోరే, ధోని, జడేజా, బ్రావో, దీపక్‌ చాహర్‌, హర్భజన్‌, తాహిర్‌
ముంబయి: రోహిత్‌ శర్మ, డికాక్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, మెక్లెనగన్‌, రాహుల్‌ చాహర్‌, మలింగ, బుమ్రా

ప్రస్తుత చెన్నై బలమైన జట్టే. కానీ టోర్నీని ఘనంగా ఆరంభించిన ఆ జట్టు.. ఆ తర్వాత కాస్త తడబడుతూ సాగింది. పంజాబ్‌ చేతిలో ఓటమితో లీగ్‌ దశను ముగించింది. ఐతే ఈ కీలక మ్యాచ్‌ను సొంతగడ్డపై ఆడనుండడం చెన్నైకి సంతోషాన్నిచ్చే విషయమే. ఇక్కడ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు గెలిచింది. ఐతే ముంబయి బలమైన బౌలింగ్‌ దాడిని ఎదుర్కొని మెరుగైన స్కోరు సాధించాలంటే టాప్‌ ఆర్డర్‌ బ్యాట్‌ ఝుళిపించాల్సిందే. కెప్టెన్‌ ధోని సూపర్‌ ఫామ్‌లో ఉండడం చెన్నైకి లాభించే అంశం. అతడితో పాటు వాట్సన్‌, డుప్లెసిస్‌, రైనాల బ్యాటింగ్‌ చెన్నైకి కీలకం. గాయం కారణంగా కేదార్‌ జాదవ్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.అతడి స్థానంలో ధ్రువ్‌ షోరే జట్టులోకి రావొచ్చు. ఇక ఈ సీజన్‌లో చెన్నైకి గొప్ప బలం బౌలింగే. అద్భుత ఫామ్‌లో ఉన్న స్పిన్నర్‌ తాహిర్‌పై చెన్నైకి చాలా ఆశలే ఉన్నాయి. అతడితో జడేజా, హర్భజన్‌లతో చెన్నై స్పిన్‌ విభాగం అత్యంత బలంగా కనిపిస్తోంది. శక్తివంతమైన ముంబయి బ్యాటింగ్‌ లైనప్‌పై వీళ్లెంత బాగా రాణిస్తారన్నదానిపైనే బహుశా మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉండొచ్చు. ఇక నిలకడగా రాణిస్తోన్న పేసర్‌ దీపర్‌ చాహర్‌ మరోసారి విజృంభించాలని సూపర్‌కింగ్స్‌ కోరుకుంటోంది. అతడు ఆరంభంలో వికెట్లు పడగొట్టడం చెన్నైకి ఎంతో ముఖ్యం.

ముంబయి తన చివరి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఈ సీజన్‌లో చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గడం, అందులో చెన్నైలో ఆడిన మ్యాచ్‌ కూడా ఉండడం ముంబయి విశ్వాసాన్ని పెంచుతోంది. రోహిత్‌ శర్మ, క్వింటన్‌ డికాక్‌, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌లతో దుర్భేద్యంగా ఉన్న ముంబయి.. పరుగుల వరద పారించకుండా అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు పెను సవాలే. ముఖ్యంగా బ్యాటుతో భీకరంగా విరుచుకుపడుతున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌.. బంతితోనూ రాణిస్తుండడం ముంబయిని మరింత బలోపేతం చేస్తోంది. ముంబయి బౌలింగ్‌ కూడా మామూలుగా లేదు. బుమ్రా, మలింగ, పాండ్య సోదరులు, యువ లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌లతో కూడిన పదునైన బౌలింగ్‌ దళం ఆ జట్టు ఆశలు పెంచుతోంది. పరుగులివ్వడంలో పిసినారిగా వ్యవహరిస్తూనే కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ ముంబయి విజయాల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. యువ లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ కూడా ముంబయికి కీలకం కానున్నాడు. ఐతే జట్టు మంచి ఫామ్‌లో ఉన్నా.. చెన్నైలో విజయం అంత తేలికేమీ కాదని ముంబయికి తెలుసు.

hyderabad to play off in ipl 2019aనేటి మ్యాచ్ : ముంబై vs చెన్నై మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు జరుగనుంది.

Related posts