మన బ్యాంకింగ్ వ్యవస్థకు ఎన్‌బీఎఫ్‌సీలు ఇబ్బందిగా మారాయి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సమ్మిళిత ఆర్థిక అభివృద్ధే తమ లక్ష్యమని సీతారామన్ ఉద్ఘాటించారు. పదేళ్ల విజన్‌తో బడ్జెట్ రూపొందించామని తెలిపారు. ఈ బడ్జెట్ వల్ల మధ్యతరగతి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు.
స్టార్టప్ కంపెనీలకు పెద్దమొత్తంలో పన్ను రాయితీలు ఇస్తామన్నారు. కాలుష్యం తగ్గించేందుకే విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో విద్యుత్ వాహనాల తయారీ పరిశ్రమలు పెరుగుతాయి. గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. పట్టణాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు బడ్జెట్ తోడ్పాటును అందిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.