telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జీడీపీ వృద్ధిరేటు 10 శాతం … అయ్యేపనేనా….: బుగ్గన

Mla buggana,data leake

రానున్న ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు 10 శాతంగా ఉంటుందన్న కేంద్ర ప్రభుత్వ అంచనాలపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమేరకు అభివృద్ధి సాధించగలిగిన అంశాలేవీ బడ్జెట్ లో లేవని, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే కేంద్రం మరోసారి మొండిచేయి చూపిందని అన్నారు. కేంద్ర బడ్జెట్ పై శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విభజన చట్టంలోని వాగ్ధానాలు మొదలుకొని జీఎస్టీ బకాయిలదాకా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై బడ్జెట్ లో ప్రస్తావన రాలేదని, కనీసం పోలవరానికి సాయంపైనా కేంద్ర మంత్రి మాట్లాడలేదని, అన్నింటికంటే ముఖ్యమైన ఏపీ ప్రత్యేక హోదాపైనా ప్రకటన చేయకపోవడం అన్యాయమని బుగ్గన వాపోయారు.

బడ్జెట్ పై ఏపీలోని ప్రతిప్రపక్ష పార్టీలు స్పందిస్తున్న తీరును మంత్రి బుగ్గన తప్పుపట్టారు. ఒకవైపు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే, టీడీపీ, ఇతర పార్టీల నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, తద్వారా వాళ్లు ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని మర్చిపోతున్నారని బుగ్గన మండిపడ్డారు. సీఎం జగన్ చేపట్టిన పనులన్నీ రాష్ట్రానికి మేలు చేసేవేనని, రివర్స్ టెండరింగ్ ద్వారా వేల కోట్లు ఆదా చేశామని, ప్యాకేజీల కోసం చంద్రబాబులా కేంద్రం ముందు సాగిలపడలేదని, అక్రమాలు జరిగాయి కాబట్టే పీపీఏలను రద్దు చేశామని మంత్రి బుగ్గన వివరించారు. తప్పులన్నీ తమవైపు పెట్టుకుని టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీపై విమర్శలు చేయడం తగదని ఆయన సూచించారు.

Related posts