BREAKING NEWS:
nagavaishnavi

నాగవైష్ణవి హత్యకేసు తుది తీర్పు

54

తెలుగువారిని కన్నీరు పెట్టించిన ఘటన అది… గుండెల్ని పిండేసిన సంఘటన… బాధను తట్టుకోలేక తండ్రి గుండె ఆగిపోయింది. మనోవేదనతో తల్లి కూడా కన్నుమూసింది. ఆ పసిబిడ్డ హత్యపై ఎనిమిదిన్నరేళ్ళ పాటు విచారణ సాగింది. అలాంటి హృదయవిదారక పాశవిక హత్యాకాండపై ఈరోజు తుది తీర్పు వెలువడనుంది.

nagavaishnavi

ఎనిమిదిన్నరేళ్ళ క్రితం బెజవాడలో జరిగిన సంఘటన ఇది. 2010 జనవరి 10న నడిరోడ్డుపై కార్ డ్రైవర్ లక్ష్మణ్ రావును హతమార్చి చిన్నారి నాగవైష్ణవిని కిడ్నాప్ చేశారు. ఆ తరువాత అత్యంత్య పాశవికంగా హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కన్నకూతురిని కళ్ళముందే కిడ్నాప్ చేసి చంపడంతో తల్లడిల్లిన తండ్రి గుండె కూడా ఆగిపోయింది. 6 నెలల్లో కేసు విచారణ పూర్తి చేస్తామన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నెరవేరలేదు. ఈలోగా మానసిక క్షోభతో తల్లడిల్లిన నాగవైష్ణవి తల్లి నర్మదా దేవి కూడా కన్నుమూసిన ఘటన అందరినీ కలచివేసింది.

nagavaishnavi

విజయవాడకు చెందిన వ్యాపారవేత్త పలగాని ప్రభాకర్ రావుకు నలుగురు సోదరులు, ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులందరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆ కుటుంబానికి ప్రభాకర్ రావు పెద్దవాడు. సోదరి వెంకటేశ్వరమ్మకు వివాహం చేశాక కొంతకాలానికి ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆమె కొడుకు, కూతురిని తీసుకొని సోదరుల దగ్గరికే వచ్చేసింది. సోదరి భర్త చనిపోవడం, తమ కుటుంబమే ఆసరా కావడంతో ఆమె కుమార్తెను ప్రభాకర్ రావు పెళ్లి చేసుకున్నారు. వారికి ఆరుగురు మగపిల్లలు అంగవైకల్యంతో పుట్టి చనిపోయారు. వైద్యులను సంప్రదిస్తే మేనరికం వల్లే ఇలా జరుగుతోందని చెప్పారు.

nagavaishnavi

ప్రభాకర రావుకు పిల్లలంటే అమితమైన ఇష్టం. కుటుంబసభ్యులు మరో వివాహం చేయాలనుకున్నప్పటికీ సోదరి వెంకటేశ్వరమ్మ దగ్గరయి విషయాన్ని ప్రస్తావించలేదు. సమీప బంధువైన నర్మదాదేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు ప్రభాకర్ రావు. వాళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు. అందులో ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి. పేరు నాగవైష్ణవి. ప్రభాకర రావుకు రెండో పెళ్లి జరిగాక రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఒక్కగానొక్క కుమార్తె నాగవైష్ణవి అంటే ప్రభాకర రావుకు ఎంతో ప్రేమ. దీంతో ప్రభాకరరావు రెండో భార్య దగ్గరే ఎక్కువగా ఉండేవాడు. దీంతో మొదటిభార్య తరచూ అతనితో వాదనకు దిగేవారు.

ఈ నేపథ్యంలోనే 2010 జనవరి 10న నడిరోడ్డుపై కార్ డ్రైవర్ లక్ష్మణ్ రావును హతమార్చి చిన్నారి నాగవైష్ణవిని కిడ్నాప్ చేశారు. ఇదే సమయంలో కారులో ఉన్న నాగవైష్ణవి సోదరుడు తప్పించుకున్నాడు. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసింది.

nagavaishnavi

నాగవైష్ణవిని ఎత్తుకెళ్లిన దుండగులు విజయవాడ నుంచి గుంటూరు వైపుకు వెళ్లారు. మార్గం మధ్యలోనే నాగవైష్ణవిని గొంతు నులిమి చంపేశారు. ఆనవాళ్లు చిక్కకుండా ఉండటానికి గుంటూరులోని ఐరన్ బ్లాస్ ఫర్నేస్ లో వేసి ఆమె ఎముకలు కూడా బూడిదయ్యేలా వేడి పెంచారు. అయితే బ్లాస్ ఫర్నేస్ నుంచి నాగవైష్ణవి చెవిపోగులు సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపారు దర్యాప్తు చేస్తున్న అధికారులు. వజ్రం కావడంతో ఈ సాక్ష్యం హత్యకేసులో కీలకంగా మారింది. పైగా డ్రైవర్ ను హత్య చేస్తున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా వాంగ్మూలం ఇచ్చారు.

nagavaishnavi

నాగవైష్ణవి వస్తుందని ఆశగా ఎదురుచూసిన ఆ కన్నా తల్లిదండ్రులకు ఇక నాగవైష్ణవి లేదనే చేదు నిజం వినాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసిన తండ్రి ప్రభాకర్ రావు గుండె ఆగిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపింది.

ఆనాడు హోమ్ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి వైష్ణవి కుటుంబాన్ని పరామర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆరునెలల్లో విచారణ పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. కానీ ఈ కేసు విచారణ ఎనిమిదేళ్లపాటు జరిగింది. ఈ కేసులో ఏ1 నిందితుడు మెర్ల శ్రీనివాస రావు, ఏ2 నిందితుడు వెంపరాల జగదీష్, ఏ3 నిందితుడు పలగాని ప్రభాకర్ రావు బావమరిదివెంకట్రావ్ అలియాస్ కృష్ణ ను నిందితులుగా చేర్చిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 79 మంది సాక్ష్యుల్ని, డిఫెన్స్ 30 మంది సాక్ష్యుల్ని విచారించింది.

nagavaishnavi

వెంకట్రావు గౌడ్ ను కుట్రదారునిగా ఈ కేసులో పేర్కొన్నారు. అయితే నిందితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేస్తే పూర్తి నిజాలు బయటపడతాయని అప్పట్లో వైష్ణవి తల్లి నర్మదా అధికారులకు విజ్ఞప్తి చేశారు. రోజులు గడుస్తున్నా నిందితులకు శిక్ష పడకపోవడం, న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరగడం, దీనికి తోడు బ్రెయిన్ కాన్సర్ తో ఆమె కుంగిపోయారు. నాగవైష్ణవి తల్లి ఏడాదిన్నర క్రితం మరణించారు. ఈ కుటుంబంలో ప్రభాకర్ రావు ఇద్దరు కుమారులు మాత్రం మిగిలారు. వీరు కూడా ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.

nagavaishnavi

రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసిన ఈ ఘటనలో ఇంకా న్యాయం జరగకపోవడంపై మండిపడుతున్నారు మహిళా సంఘాలు. మంత్రులు వచ్చిపోతున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వైష్ణవి మరణం వల్ల వారి కుటుంబం కకలావికలమైందని, ఇలాంటి కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఈరోజు చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో మహిళా సెషన్స్ కోర్ట్ తుది తీర్పును వెల్లడించనుంది. నిందితులు ఎనిమిదేళ్లుగా జైల్లోనే ఉన్నారు. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈరోజు తుది తీర్పు వెలువడనుండడంతో కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

– విమలత