telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

గ్రేటర్‌ పోలింగ్ లో వార్స్…

జీహెచ్‌ఎంసీ‌లో ఓటింగ్ కొనసాగుతోంది.. అయితే, పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి… గచ్చిబౌలి గోపన్‌పల్లిలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అటు నాచారం డివిజన్‌లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వర్గీయులు కొట్టుకున్నారు. పార్టీ కండువాలతో పోలింగ్‌ బూత్‌లలోకి రావడంపై అభ్యంతరం వక్తం చేశారు. చివరకు మాటా మాటా పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లింది వ్యవహారం.. మరోవైపు.. జంగంమెట్‌ డివిజన్‌  రెయిన్‌బజార్‌ పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌ కలకలం రేపింది. ఎంఐఎం కార్యకర్తలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ నేతలను తరమికొట్టేందుకు ప్రయత్నించారు ఎంఐఎం కార్యకర్తలు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. బంజారాహిల్స్‌లో పోలింగ్‌ బూత్‌ల వద్ద మాస్క్‌ల గొడవతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. మూడు పార్టీలకు చెందిన వ్యక్తులు.. పార్టీ గుర్తులతో ఉన్న మాస్కులు పెట్టుకుని బూత్‌ల వద్దకు వచ్చారు. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ చెలరేగింది. పోలీసులు వచ్చి సర్దిచెప్పి అందరినీ అక్కడి నుంచి పంపేశారు. ఇక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పలువరి ఓట్లు గల్లంతయ్యాయి. మూసాపేట, జూబ్లీహిల్స్‌ డివిజన్లలో ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు ఆరోపిస్తున్నారు… ఓటు వేయడానికి వచ్చి.. లిస్ట్‌లో తమ పేర్లు లేకపోవడంతో నిరాశ చెందారు. ఎన్నికల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. అజంపుర పోలింగ్‌ బూత్‌లో దొంగ ఓట్లు కలకలం రేపుతోంది. దొంగ ఓటు వేసేందుకు ఆరు ఆటోల్లో  మహిళలు వచ్చారు. అనుమానంతో పోలీసులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Related posts