అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జేమ్స్ బీ రైలీ అనే యువకుడు మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. గంటకు 115మైళ్ల (186కి.మీలు) వేగంతో వెళ్తూ మలుపు తిరిగే ప్రయత్నం చేయడంతో అదుపుతప్పిన అతని టెస్లా కారు పక్కనే ఉన్న ఓ గోడకు గుద్దుకొని పేలిపోయింది. ఈ ప్రమాదంలో రైలీతో పాటు ముందు సీట్లో కూర్చొని ఉన్న మరో కుర్రాడు కూడా మరణించాడు. వెనకసీట్లో ఉన్న మరో అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. గతేడాది జరిగిన ఈ ప్రమాదంపై కోర్టుకెక్కిన రైలీ తండ్రి.. తన కుమారుడి మరణానికి టెస్లా కంపెనీనే కారణమంటూ వాదన వినిపించాడు. కారు బ్యాటరీలు సరిగా లేవని, అవి పేలడం వల్లే తన కుమారుడు మరణించాడని ఆయన ఆరోపించాడు. అంతేగాక కారు వేగం గంటకు 85మైళ్లకు మించకుండా ఓ లిమిటర్ ఉంటుందని, తమకు తెలియకుండా ఓ టెస్లా సర్వీస్ సెంటర్ ఉద్యోగి దాన్ని తొలగించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని వాదించాడు. ఈ కేసుపై టెస్లా కంపెనీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
previous post
ఎమ్మెల్యే రోజావి పగటి కలలు: టీడీపీ ఎమ్మెల్యే అనిత