telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నిన్న తహశీల్దార్ పై పెట్రోల్.. నేడు రైతే పోసుకున్నాడు..

farmer suicide attempt in mro office

తెలంగాణాలో జరిగిన పెట్రో మంట తగ్గకుండానే కడప జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతు తహశీల్దార్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.మూడేళ్లుగా తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా.. తన సమస్యను పట్టించుకోవట్లేదని ఆవేదన చెందిన అతను మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించాడు. తహశీల్దార్ చాంరబ్‌లోనే ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామంలో 10.94 ఎకరాల డీకేటీ భూమి ఉంది. ఇందులో నరసింహ అనే వ్యక్తికి చెందిన 3.50 ఎకరాల భూమికి గండికోట ప్రాజెక్ట్ ముంపు పరిహారం దక్కింది. మిగిలిన భూమిపై వివాదం నడుస్తోంది. ఇందులో 3.50 ఎకరాలు తన తండ్రి పేరుతో ఉందని ఆది నారాయణ(46) అనే రైతు చెబుుతన్నారు.చాలా కాలం నుంచి ఆ భూమికి తామే అనుభవదారులం అని, తన తల్లి పేరుపై భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

అదే సమయంలో ఆన్‌లైన్‌లో పేరు నమోదు కోసం మూడేళ్ల నుంచి తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆదినారాయణ పెట్రోల్ డబ్బాతో తహశీల్దార్‌ చాంబర్‌లోకి వచ్చాడు. తహశీల్దార్ మాధవకృష్షారెడ్డి ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న సిబ్బంది.. వెంటనే ఆది నారాయణపై నీళ్లు చల్లి అతన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 1989 నుంచి ఆ భూమికి తామే అనుభవదారులం అని.. ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మూడేళ్ల నుంచి తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానని నారాయణ వాపోయాడు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. తహశీల్దార్ మాత్రం.. అది కోర్టు పరిధిలో ఉందని.. డీకేటీ భూమి అని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చేవరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కుదరదన్నారు.

Related posts