సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా త్వరలో అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతోంది. ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. మూడు నెలల ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌లు జరగనున్నాయి. నవంబర్ 27న మొదలయ్యే ఈ టూర్ కోసం భారత జంబో జట్టు దుబాయ్ నుంచి సిడ్నీకి ప్రత్యేక విమానంలో వెళ్లనుంది. అయితే టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తొడకండరాల గాయం కారణంగా ఈ పర్యటనకు పూర్తిగా దూరమయ్యాడు. రోహిత్ శర్మకి చోటు దక్కకపోవడంపై దుమారం రేగుతోంది. ఈ నెల 18న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ ఆడుతూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో గాయంతోనే సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్.. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. దాంతో సూపర్ ఓవర్‌లో కెప్టెన్‌గా కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్ జట్టుని నడిపించాడు. మ్యాచ్ అనంతరం పోలార్డ్ మాట్లాడుతూ రోహిత్ తొండ కండరాలకి గాయమైందని, తర్వాత మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడని చెప్పాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండింటికీ రోహిత్ దూరంగానే ఉన్నాడు.
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20, టెస్టు సిరీస్‌ల కోసం సోమవారం బీసీసీఐ మూడు జట్లను ప్రకటించింది. ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మను జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు. దీంతో రోహిత్ గాయంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం చేశారు. రోహిత్ గాయంపై ముంబై ఇండియన్స్, భారత సెలక్టర్లు స్పష్టమైన సమాచారం చెప్పకపోవడంపై మండిపడ్డారు. రోహిత్ శర్మకు ఏమైందో తెలుసుకునే అర్హత ప్రతి భారత క్రికెట్ అభిమానికి ఉందని.. ముంబై మేనేజ్మెంట్, బీసీసీఐని నిలదీయండన్నారు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ ఆదివారం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అతనికి ఎలాంటి గాయమైందో? నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే రోహిత్ ఫ్యాడ్స్ కట్టుకుని ప్రాక్టీస్ ఎలా చేస్తాడు. చిన్న గాయమే అనుకుంటే.. ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్‌లో పక్కన పెట్టొచ్చు. డిసెంబరు 27 నుంచి ప్రారంభమయ్యే టెస్టులకి అవకాశం కల్పించొచ్చు. ఎందుకంటే రోహిత్ ఫిట్‌నెస్ సాధించడానికి దాదాపు నెలన్నర సమయం ఉంది. అది జరగలేదు’ అని అన్నారు.
‘రోహిత్ శర్మకి ఏమైందనే విషయం కనీసం ఇప్పటికైనా ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ అధికారులు నిజాయతీగా చెప్పాలి. గాయంపై ఓ స్పష్టత ఇవ్వాలి. తన ఫేవరేట్ ఆటగాడికి ఏమైందనే విషయం తెలుసుకునే అర్హత ప్రతి భారత అభిమానికి ఉంది. ఫ్రాంచైజీలు బాధను అర్ధం చేసుకోగలను. కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్నది భారత జట్టు గురించి. మయాంక్ అగర్వాల్ కూడా గాయపడ్డాడు. కానీ అతనికి మూడు జట్లలో చోటు దక్కింది. మరి రోహిత్ శర్మకి ఏమైంది. ఎందుకు అతన్ని పక్కనపెట్టారు. గాయం తీవ్రత గురించి చెప్పకుండా దాయాల్సిన అవసరం ఏముంది?’ అని గవాస్కర్ ప్రశ్నించారు.
వివేకానందరెడ్డి హత్యలో టీడీపీ నేతల ప్రమేయం: షర్మిల