telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్ర‌ముఖ జ్యోత్యిష్య పండితులు ..పంచాంగ కర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి మృతి

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సుప‌రిచితులైన ప్ర‌ముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, పంచాంగకర్త ములుగు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి ఆదివారం కన్నుమూశారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను కుటుంబ స‌భ్యులు పంజాగుట్టాలోని నిమ్స్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుప‌త్రికి చేరుకునే లోపే రామ‌లింగేశ్వర సిద్ధాంతి మార్గ‌మ‌ద్యంలో తుది శ్వాస విడిచిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు.

పలు టీవీలు, యూట్యూబ్ ఛానెల్స్‌లో దిన, వార, మాస ఫలాలు చెబుతూ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఎంతో మందికి చేరువ‌య్యారు. దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిస్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ చేసిన ములుగు సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు. ములుగు సిద్ధాంతి.. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజా, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వ‌హించారు.

ఇదిలా ఉంటే ములుగు సిద్ధాంతిగా ఆధ్యాత్మ జీవితాన్ని ప్రారంభించేకంటే ముందు సిద్ధాంతి ఎమ్ఆర్ ప్ర‌సాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంత‌ర్జాతీయంగా ఖ్యాతి గ‌డించారు. సినీ నటులు ఏవీఎస్‌, బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు. రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి మరణం పట్ల ఆయన శిష్యులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు

Related posts