telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఫ‌ల‌క్‌నుమా దాస్‌” మా వ్యూ

Falaknuma-Das

బ్యానర్ : వాన్మయే క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌
నటీనటులు: విశ్వక్‌సేన్‌, సలోనీ మిశ్రా, హర్షితా గౌర్‌, తరుణ్‌ భాస్కర్‌, అభినవ్‌ గోమతం
దర్శకత్వం: విశ్వక్‌ సేన్‌
సంగీతం: వివేక్‌ సాగర్‌

“ఈ నగరానికి ఏమైంది” సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు విశ్వక్‌ సేన్‌. తాజాగా విశ్వక్‌ సేన్‌ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “ఫ‌ల‌క్‌నుమా దాస్‌”. వాస్తవికతకు దగ్గరగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ చిత్రం “అంగ‌మ‌లై డైరీస్” అనే ఓ మ‌ల‌యాళ చిత్రానికి రీమేక్. అయితే ఈ రీమేక్ కు తెలంగాణ నేటివిటీ జోడించే ప్రయత్నం చేశారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాము.

కథ :
దాసు (విశ్వక్ సేన్‌) చిన్నప్పటినుంచీ శంక‌ర‌న్న అనే లోక‌ల్ గుండాని చూసి తాను కూడా అలా అవ్వాల‌ని క‌ల‌లు కంటుంటాడు. ఫ‌ల‌క్‌నుమాలో ఓ గ్యాంగ్ ని వేసుకుని కొట్లాట‌లూ అంటూ తిరుగుతుంటాడు. ఇలా తిరుగుళ్లకు అలవాటు పడిన దాసు డిగ్రీ ఫెయిల్ అవుతాడు. ఆ తరువాత త‌న స్నేహితుల‌తో క‌లిసి మ‌ట‌న్ వ్యాపారం మొద‌లెడ‌తాడు. అయితే దాసుకు అదే వ్యాపారం చేస్తున్న ఇద్దరు రౌడీ బ్రదర్స్‌తో గొడవ ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు దాసు. ఆ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే రూ.25 ల‌క్షలు అవ‌స‌రం అవుతాయి. ఆ డ‌బ్బు సంపాదించ‌డానికి ర‌క‌ర‌కాల మార్గాలు ఎంచుకుంటాడు. అవ‌న్నీ త‌న‌కు కొత్త త‌ల‌నొప్పుల్ని, శ‌త్రువుల్నీ తెచ్చి పెడతాయి. హత్య కేసు నుంచి దాసు ఎలా తప్పించుకున్నాడు ? తనకు ఎదురైన సమస్యలేంటి ? చివరకు ఏమైందన్న విషయం తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
సినిమాలో నటీనటుల న‌ట‌న‌లో వాస్తవిక‌త‌ ప్రతిబింబిస్తుంది. విశ్వక్ సేన్ న‌టనతో మెప్పిస్తాడు. విశ్వక్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ బాగున్నాయి. ఇక హీరోయిన్ల విషయానికొస్తే… ముగ్గురున్నా ఏ ఒక్కరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. స్నేహితుల బృందం, రౌడీ గ్యాంగ్ ఇలా పాత్రానుసారం తమ పరిధిమేర న‌టించారు. కాక‌పోతే లెక్కకు మించిన పాత్రలు ఉండడంతో ప్రేక్షకులకు వారిని గుర్తించుకోవడం కష్టమవుతుంది. చాలా రోజుల త‌ర‌వాత ఉత్తేజ్‌కి మంచి పాత్ర వచ్చింది. దర్శకుడు త‌రుణ్ భాస్కర్‌ నట‌న సినిమాకు స్పెషల్ అని చెప్పొచ్చు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు విశ్వక్ మలయాళం సినిమాను ఉన్నది ఉన్నట్టుగా అనుసరిస్తూ దానిని తెలంగాణ నేపథ్యానికి బాగా అన్వయించాడు. అయితే సినిమాలో పెద్దగా కథ లేదు. దాసు అనే వ్యక్తి జీవితంలోని దశలు, ఫ‌ల‌క్‌నుమా గల్లీల్లో జీవిన విధానం, మాట తీరు, దందాలు న‌డిచే ప‌ద్ధతి, కుర్రాళ్ల అల‌వాట్లూ ప్రధానంగా చూపించారు. ప్రథమాంశం పరవాలేదన్పించింది. కానీ సరైన స్క్రీన్ ప్లే లేకుండా ద్వితీయార్థంలో సాగతీత ఎక్కువైంది. క్లైమాక్స్ మాత్రం 13 నిమిషాల సుదీర్ఘమైన స‌న్నివేశాన్ని ఒకే ఒక్క షాట్‌లో తెర‌కెక్కించి సాహ‌స‌మే చేశారు. తెలంగాణ భాష‌లోని సొగ‌సు, న‌టీన‌టుల ప్రతిభ, కెమెరా టేకింగ్, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్స్.

రేటింగ్ : 2/5

Related posts