telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

భద్రతా విషయాలపై .. ఆకతాయిల వెకిలి చేష్టలు, ..పొరపాటున నిజాలైతే..!

IS confirmed Colombo blasts

ఇటీవల శ్రీలంక లో ఉగ్రదాడులతో మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది. దేశంలో కూడా అప్రమత్తతగా ఉండాలని ఇంటెలిజెన్స్ నుండి నివేదికలు రావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ పరిణామాల తాలూకా భయం తమిళనాడు రాష్ట్రాన్ని వెంటాడుతోంది. బాంబు పేరు వినబడితేనే ప్రజలు, పోలీసులు ఉలిక్కిపడుతున్నారు. బాంబు బెదిరింపులు, బెంగళూరు పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా నిఘాను తీవ్రతరం చేసింది. ముఖ్యంగా రామనాథపురంలో తీవ్రవాదులు సంచరిస్తున్నట్టు బెంగళూరులో అరెస్టైన వ్యక్తి పేర్కొన్న నేపథ్యంలో… ఆ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగా పాంబన్‌ వంతెనను పేల్చివేస్తామని వచ్చిన బెదిరింపుతో అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని అన్ని జిల్లాల్లోను ప్రధాన తీర ప్రాంతాల్లో, జనసంచారం అధికంగా వుండే రైల్వేస్టేషన్లు, ఆలయాలు ఇతర పబ్లిక్‌ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్ణాటకలో లారీ డ్రైవర్‌ సుందరసామి అరెస్టు నేపథ్యంలో తమిళనాడులో బాంబు పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పథకం వేశారని బెంగళూరు పోలీసులు తమిళనాడుకు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. రైల్వే డీజీపీ, ఐజీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కూడా ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే లంక బాంబు పేలుళ్ల భయంతో పోలీసుశాఖ జనసంచారం అధికంగా ఉండే రైల్వే స్టేషన్లను అదుపులోకి తీసుకుని, భద్రత ప్రమాణాలను పెంచింది. తాజా హెచ్చరికలతో భద్రతా చర్యలను మరింత పెంచారు.

బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు నిఘాను తీవ్రతరం చేశారు. పాంబన్‌ వంతెనపై బాంబు వుందని పోలీసుస్టేషన్‌కు శనివారం అర్దరాత్రి ఫోన్‌ రావడంతో అప్రమత్తమైన జిల్లా ఎస్పీ ఓంప్రకాష్‌ మీనా నేతృత్వంలో 50 మందికిపైగా పోలీసులు తీవ్ర తనిఖీల్లో చేపట్టారు. వంతెనను దాటి వెళ్తున్న వాహనాలు, బస్సులను తీవ్ర తనిఖీల అనంతరమే అనుమతిస్తున్నారు. దీనిపై ఎస్పీ ఓంప్రకాష్‌ మీనా మీడియాతో మాట్లాడుతూ, పాంబన్‌ వంతెన మీదుగా వెళ్లే ద్విచక్ర వాహనాలు, ప్రభుత్వ బస్సులు, రామేశ్వరం నుండి నడిపే రైళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నామని, అలాగే రామేశ్వరంలోని లాడ్జీలు, కల్యాణ మండపాల్లో కూడా పోలీసులు తనిఖీలు జరుపుతున్నట్లు తెలిపారు. బాంబు బెదిరింపు మేరకు బాంబు స్క్వాడ్‌ నిపుణులు, జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీ చేశామని, అయితే ఎలాంటి బాంబులు లభ్యం కాలేదని, బెదిరింపు కారణంగా రెండు వంతెనల వద్ద పోలీసు భద్రత ఏర్పాటుచేశామని ఆయన చెప్పారు.

రాజధాని నగరం చెన్నైలోనూ బాంబు పెట్టినట్టు నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే భార్యతో ఏర్పడిన విభేదాల కారణంగా మద్యం మత్తులో ఈ చర్యలకు పాల్పడినట్టు అతను వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక వెప్పేరిలోని పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి గత శుక్రవారం ఫోన్‌ చేసిన ఓ అజ్ఞాతవ్యక్తి శ్రీలంకలో బాంబులు పెట్టింది తానేనని, అదే విధంగా చెన్నై మేట్టుకుప్పంలో కూడా పెట్టానని, చేతనైతే తనను పట్టుకోమని సవాలు విసురుతూ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు సెల్‌ఫోన్‌ నెంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టి.. మైఖేల్‌ ట్రేడి (43) అనే వ్యక్తి అరెస్టు చేశారు. భార్యతో వాగ్వాదం కారణంగా మద్యం మత్తులో తన ఆమెను ఇరికించాలన్న ఉద్దేశంతోనే బెదిరింపులకు పాల్పడినట్టు విచారణలో చెప్పాడు. అయినప్పటికీ సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక బాంబు పేలుళ్ల అనంతరం ఆ దేశానికి అత్యంత సమీపంలో ఉన్న తమిళనాట పేలుళ్ల భయం వెంటాడుతోంది. బాంబు మాట వినపడితే పోలీసుశాఖ ఉలిక్కిపడుతోంది.

Related posts