telugu navyamedia
క్రీడలు వార్తలు

డివిలియర్స్‌ రన్ఔట్ తర్వాత నన్ను చంపేస్తామన్నారు : డుప్లెసిస్

ప్రస్తుతం 36 ఏళ్ల డుప్లెసిస్ దక్షిణాఫ్రికా తరఫున ఆడుతుండగా.. 37 ఏళ్ల డివిలియర్స్‌ 2018లోనే రిటైర్మెంట్‌ ఇచ్చాడు. 2011 ప్రపంచకప్‌లో భాగంగా ఢాకా వేదికగా మూడవ క్వార్టర్ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా తలపడింది. డేనియల్ వెటోరి నేతృత్వంలోని న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 221 పరుగులు చేసింది. జెస్సీ రైడర్ 83 పరుగులు చేయడంతో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 172 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దక్షిణాఫ్రికా స్కోరు 121-4గా ఉన్న సమయంలో ఫాఫ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. సమన్వయ లోపం కారణంగా డివిలియర్స్‌ రనౌట్ అయ్యాడు. ఫాఫ్ 36 పరుగులు చేశాడు. స్వల్ప స్కోరును ఛేజింగ్ చేయలేక దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫాఫ్ డుప్లెసిస్ తనపై వచ్చిన బెదిరింపుల గురించి చెప్పాడు. ‘ఆ మ్యాచ్ ఓడిపోయి ఇంటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నా మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. నన్ను, నా భార్యను చంపేస్తామని కొందరు బెదిరించారు. ఆ ఘటన చాలా వ్యక్తిగతంగా మారింది. చెప్పడానికి కూడా వీలులేనటువంటి మెసేజెస్ వచ్చాయి. చాలా బాధేసింది. అది ఆటపై కూడా ప్రభావం చూపింది. అయితే జట్టులో నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాను’ అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

Related posts