telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక సినిమా వార్తలు

ఫేస్ యాప్ వాడుతున్నారా ?… అయితే జాగ్రత్త

Face-app

ఫేస్ యాప్ మొబైల్ అప్లికేషన్ ఇటీవల కాలంలో వైరల్ గా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓ వ్యక్తి కొన్నేళ్ల తర్వాత ఎలా ఉంటారో, కొన్నేళ్ల ముందు ఎలా ఉన్నారో ఫోటోని మార్చి చూపించడం ఫేస్ యాప్ ప్రత్యేకత. రష్యాకు చెందిన వైర్‌లెస్ ల్యాబ్ కంపెనీ రూపొందించిన యాప్ ఇది. ఫేస్ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. ఫేస్ యాప్ ఆల్గరిథమ్ ఓ ఫోటోను తీసుకొని డీప్ జెనరేటీవ్ కన్వొల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్స్ ద్వారా మీరు కోరుకున్నట్టుగా ఫోటోను జెనరేట్ చేస్తుంది. అంటే భవిష్యత్తులో ఎలా ఉంటారన్న దగ్గర్నుంచి జుట్టు రంగు, గడ్డం మార్చడం వరకు ఏదైనా ఫేస్ యాప్‌తో సాధ్యం. అంతేకాదు… మగాళ్లను, ఆడవాళ్లుగా, ఆడవాళ్లను మగవాళ్లుగా మార్చే ‘స్వాప్ జెండర్’ ఫీచర్ కూడా ఉంది. తాము భవిష్యత్తులో ఎలా ఉంటామో, స్టైల్ మార్చితే ఎలా ఉంటామో తెలుసుకునేందుకు చాలామంది ఫేస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వాడుతున్నారు. ఫేస్ యాప్ ఎక్కువగా యూత్‌ను అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే 10 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఇది ఫ్రీ యాప్. దీంతో చాలామంది తమ ఫోటోలను మార్చి #FaceAppChallenge హ్యాష్‌ట్యాగ్‌తో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు.

అయితే దీంట్లో ప్రైవసీ ఎంతనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఏ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నా ప్రైవసీ పాలసీ చదివే అలవాటు దాదాపు ఎవరికీ ఉండదు. ‘agree’ ట్యాబ్ పైన క్లిక్ చేసేస్తారంతే. ఫేస్ యాప్ ప్రైవసీ పాలసీ పూర్తిగా చదివితే అసలు విషయాలు తెలుస్తాయి. మీ కంటెంట్‌ని షేర్ చేసేందుకు ఫేస్ యాప్‌కు యాక్సెస్ లభిస్తుంది. మీ పేరు, కుకీస్, లొకేషన్ డేటా, యూసేజ్ డేటా లాంటివాటిని వ్యాపారులకు షేర్ చేసే అవకాశముంది. ఫేస్ యాప్ సర్వర్లు లాగ్ ఫైల్ ఇన్ఫర్మేషన్‌ను ఆటోమెటిక్‌గా రికార్డ్ చేసుకుంటాయి. మీ వెబ్ రిక్వెస్ట్, ఐపీ అడ్రస్, బ్రౌజర్ టైప్, రిఫర్ పేజీలు, యూఆర్ఎల్, డొమైన్ పేర్లు, ల్యాండింగ్ పేజీలు, చూసిన పేజీలు ఇలా… అనేక సమాచారం ఫేస్ యాప్‌కు తెలిసిపోతుంది. మీరు ఫేస్ యాప్‌‌కు ఇచ్చిన యాక్సెస్ శాశ్వతమైనది, మార్చలేనిదిగా మారిపోతుంది. అంతేకాదు… మీరు అప్‌లోడ్ చేసే ఫోటో కూడా ఫేస్ యాప్ చేతుల్లోకి వెళ్తుంది. ఆ ఫోటోను ఫేస్ యాప్ ఎక్కడైనా, ఎందుకోసమైనా ఉపయోగించుకునేందుకు మీరు అనుమతి ఇచ్చినట్టే అవుతుంది. అయితే ఫేస్ యాప్‌లో ఫోటో అప్‌లోడ్ చేసిన 48 గంటల్లో సర్వర్ నుంచి ఫోటో తొలగిపోతుందని యాప్ డెవలపర్ వైర్‌లెస్ ల్యాబ్ కంపెనీ చెబుతోంది. కానీ ప్రైవసీకి ముప్పు ఉందన్న భయాందోళనలు టెక్ నిపుణుల్లో కనిపిస్తున్నాయి. అమెరికా సెనేటర్ చక్ షుమర్ ఫేస్ యాప్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ FBI, FTC దీనిపై దర్యాప్తు చేయాలని కోరడం గమనార్హం. ప్రస్తుతం ఈ యాప్ సెక్యూరిటీ విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

Related posts