telugu navyamedia
సినిమా వార్తలు

ఎఫ్‌-2 రివ్యూ : ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌

f2
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
నటీనటులు : వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ తదితరులు 
దర్శకత్వం : అనిల్‌ రావిపూడి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ : సమీర్‌రెడ్డి
ఎడిటింగ్‌ : బిక్కిని తమ్మిరాజు
నిర్మాత : దిల్‌రాజు
అనిల్‌ రావిపూడి ఎలాంటి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోలికి పోకుండా ఒక్క ఫైట్ కూడా లేకుండా సినిమాను తీశానని ప్రకటించారు. ఇక వెంకటేష్‌ గురించి కామెడీ టైమింగ్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువనటుడు వరుణ్ తేజ్ క్రేజ్… తమన్నా, మెహ్రీన్ గ్లామర్… ఇక సినిమా ప్రమోషన్స్ లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా ప్రీమియర్ షోలకు కూడా మంచి స్పందనే లభించింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుందో చూద్దాం. 
కథ :
వెంకీ (వెంక‌టేష్‌) ఒక ఎమ్మెల్యే ద‌గ్గ‌ర పీఏగా ప‌ని చేస్తుంటాడు. హారిక‌ (త‌మ‌న్నా), హ‌నీ (మెహ‌రీన్‌) ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. వారిలో పెద్దదైన హారిక‌ను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. భార్య‌, అత్త వెంకీని త‌మ ఆధీనంలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దీంతో అప్పటివ‌ర‌కూ సాఫీగా సాగిపోతున్న వెంకీ జీవితంలో పెళ్లి తరువాత ఒక్క‌సారిగా ఫ్రస్ట్రేషన్ గా మారిపోతుంది. ఆ తరువాత వ‌రుణ్ యాద‌వ్‌ (వ‌రుణ్‌తేజ్‌) హ‌నీ (మెహ్రీన్)ను ప్రేమిస్తాడు. ఆమెను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అప్ప‌టికే అత్తింటి ప‌రిస్థితులు తెలిసిన వెంకీ… హ‌నీని పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని వ‌రుణ్‌యాద‌వ్‌ను ముందుగానే హెచ్చ‌రిస్తాడు. కానీ వరుణ్ కు హానీపై ఉన్న ప్రేమ వల్ల వెంకీ హెచ్చరికను పట్టించుకోడు. హ‌నీని పెళ్లి చేసేసుకుంటాడు వరుణ్. అక్కాచెల్లెళ్లు చెలాయించే ఆధిప‌త్యానికి తాళలేక తోడ‌ళ్లులు ఇద్దరూ న‌లిగిపోతుంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతే, ఆ అక్కాచెల్లెళ్లకు మీ విలువ తెలుస్తుందని ప‌క్కింటి వ్య‌క్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) ఈ తోడ‌ల్లుళ్లకు ఒక స‌ల‌హా ఇస్తాడు. దీంతో ఇద్ద‌రూ ప్లాన్ చేసుకొని యూర‌ప్ వెళ్తారు. అయితే, వెంకీ, వ‌రుణ్‌ల‌తో పాటు, హారిక‌, హ‌నీలు కూడా యూర‌ప్ వెళ్తారు. వీరంద‌రూ కలిసి ప్ర‌కాష్‌రాజ్ ఇంట్లో దిగుతారు. ఇంత‌కీ వీళ్లు యూర‌ప్ ఎందుకు వెళ్లారు ? ప‌్ర‌కాష్‌రాజ్ ఇంట్లోనే ఎందుకు దిగారు ? ఆ తరువాత తోడల్లుళ్లు పెళ్ళాల మనసును మార్చగలిగారా ? లేక వాళ్లే మారిపోయారా ? చివరకు ఏం  జరిగింది ? అనేది వెండి తెరపై వీక్షించాల్సిందే. 
నటీనటుల పనితీరు :
వెంక‌టేష్ చాలా కాలం త‌ర్వాత మంచి కామెడీ టైమింగ్ పాత్ర‌లో క‌నిపించారు. పాత చిత్రాల్లో వెంక‌టేష్ ఎలా న‌వ్వించారో ఈ సినిమాలో తన నటనతో అంతకంటే ఎక్కువగానే న‌వ్వించారు. వెంకీ ఈజ్ బ్యాక్ అనాల్సిందే… వ‌రుణ్ తేజ్ కూడా తెలంగాణ యువకుడిగా చ‌క్క‌గా న‌టించాడు. కానీ తెలంగాణ యాసను వ‌రుణ్‌ తెరపై అంతబాగా పలికించలేకపోయాడు. దీంతో ఆ యాస కృత్రిమంగా అన్పిస్తుంది. త‌మ‌న్నాకు కూడా చాలా రోజుల త‌ర్వాత పూర్తి స్థాయి క‌థానాయిక‌గా మంచి పాత్ర దక్కింది. మెహ‌రీన్ తన ప్రత్యేక మ్యానరిజంతో ఫర్వాలేదన్పించింది. ఈ ఇద్దరు హీరోయిన్ల గ్లామర్ సినిమాకు ప్లస్ పాయింట్. ఇక రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌, ర‌ఘుబాబు, అన్న‌పూర్ణ‌, వై.విజ‌య తదితరులు చక్కగా నవ్వించారు. 
సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాలో పెద్దగా ట్విస్టులు లేకపోయినా ప్రతి ఇంట్లో జరిగే విషయాలను అందంగా తెరపై చూపించి ప్రేక్షకులను మెప్పించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సినిమాలో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకతనిచ్చి, ప్రతి సన్నివేశంలోనూ నవ్వులతో నింపేశాడు. ప్రథమార్థం పూర్తిగా వినోదాత్మకంగా ఉంది. ప్రథమార్ధంతో పోల్చుకుంటే ద్వితీయార్థం వీక్ అయినట్టుగా, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అన్పిస్తాయి. సున్నితమైన వినోదాన్ని తెరపై పండించి, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ సాధించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఫరవాలేదన్పించింది. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. 
రేటింగ్ : 3/5

Related posts