నేటి కేంద్ర బడ్జెట్ పై తెలంగాణా ప్రభుత్వం పెద్ద పెద్ద ఆశలే పెట్టుకుంది. ఇప్పటికే కేంద్రం తెలంగాణా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో, నెరవేర్చాల్సిన హామీల విషయంలో పెద్దగా పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్న క్రమంలో ఈ బడ్జెట్ తో అయినా తెలంగాణాకు రావాల్సిన నిధులు వస్తాయా.. అని ఆశగా ఎదురు చూస్తుంది. ఆర్ధిక భారం కాస్తైనా తగ్గుతుందా అని తెలంగాణా రాష్ట్రం నేటి బడ్జెట్ కేటాయింపులపై నజర్ పెట్టింది. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది . దీంతో పాటు ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన బకాయిలు కూడా ఇవ్వలేదు . విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సినవి తక్షణం ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతూ వస్తున్నా కేంద్రం మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదు.
ఇప్పటికీ పూర్తి కాని ప్రాజెక్టులు తెలంగాణలో చాలా ఉన్నాయి. కేంద్రం నుంచి రావలసిన బకాయిలు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం వస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ జరుగుతుందని ప్రభుత్వం ఆశతో ఎదురుచూస్తుంది . కొత్తగా రైల్వే మార్గాలు , రోడ్డు మార్గాలు కూడా కావాలని కేంద్రాన్ని కోరుతుంది .జాతీయ ఉపాధి హామీ పథకం లో నగేరా కింద రూ.250 కోట్లు విడుదలచేయాలని అభ్యర్తిస్తుంది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, పాల్వంచలో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఏర్పాటుపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ బడ్జెట్ కేటాయిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. జహీరాబాద్‌లో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్, హైదరాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ఏర్పాటుకు సహకరించాలని కోరుతుంది తెలంగాణా సర్కార్ . వరంగల్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్‌కు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్- బెంగళూరు- చెన్త్నె సౌత్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చెయ్యటానికి కేంద్రం చొరవ చూపాలని కోరుతుంది.
ఇక విభజన చట్టం ప్రకారం ప్రకటించిన హామీలు నెరవేరలేదు. విభజన చట్టంలో ఎయిమ్స్ ప్రకటించినా అనుమతులు, కేటాయింపులు జరగలేదు. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో కదలికే లేదు నీతిఆయోగ్ సిఫార్సు చేసిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేదు . జీఎస్టీ నష్టపరిహారం రూ.1,131 కోట్లు, ఐజీఎస్టీ సర్దుబాటులో పెండింగ్‌లో ఉన్న రూ.2,812 కోట్లను విడుదలచేయాలని కోరుతుంది. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు సాయం చేయాలని కూడా కేంద్రాన్ని రాష్ట్రం కోరింది . ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, ఒక భారీ రైల్వే ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరుతోంది. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌కు ఒకేసారి రూ.వెయ్యికోట్లు, ఖాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, రైల్వే ప్రాజెక్టులకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలి. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పా టు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్, ఐఐఎస్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఏర్పాటు అంశా లను రాష్ట్ర ప్రభు త్వం కేంద్రం ముందుంచింది. ఈసారి బడ్జెట్ లో తగినన్ని నిధులు, సహకారం ఉంటే ఆర్ధిక మాంద్యం నుండి గట్టెక్కుతామని భావిస్తుంది.