telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సినిమా థియేటర్ల యజమానులకు శుభవార్త!

Theatre

కొవిడ్ 19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా మూతపడిన థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. భారతదేశంలో కేవలం యాభై శాతం ఆక్యుపెన్సీతోనే చిత్ర ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాంతో ఇటీవలే కేరళలోని థియేటర్లు సైతం కొన్ని తెరచుకున్నాయి. అయితే.. గడిచిన తొమ్మిది మాసాలలో థియేటర్లు మూసేసిన కారణంగా ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, యాభై వేల రూపాయల లోపు ఉన్న బిల్లులను రద్దు చేయాలని, అక్కడి ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా యాభై శాతం ఉన్న ఆక్యుపెన్సీని ఎనభై శాతంకు పెంచాలని కోరుకుంటున్నారు. జిఎస్టీతో పాటు ఎంటర్ టైన్ మెంట్ టాక్స్ ను రద్దు చేయమని అంటున్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చేంతవరకూ థియేటర్లు తెరవమని కొందరు ఎగ్జిబిటర్లు మొండికేశారు. కానీ ఇటీవలే కొంతమంది మాత్రం మనసు మార్చుకుని థియేటర్లను ఓపెన్ చేశారు. ఈ నేపథ్యంలో వారి డిమాండ్లను పరిశీలించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ యేడాది జనవరి నుండి మూడు నెలల వరకూ అంటే మార్చి మాసం వరకూ ఎంటర్ టైన్ మెంట్ టాక్స్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అలానే థియేటర్లు మూసి ఉన్న పది మాసాల ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ బిల్లులో యాభై శాతాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపారు. థియేటర్లకు సంబంధించిన వివిధ అనుమతులను పొడిగిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మరి విజయన్ నిర్ణయంతో మరిన్ని థియేటర్లు కేరళలో తెరుచుకుంటాయేమో చూడాలి.

Related posts