సీపీఎం సీనియర్ నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అనుమానించిన కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆయనను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
సీపీఎం సీనియర్ నేత అయిన రాజయ్య మూడుసార్లు ( 1999, 2004, 2014) భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజయ్య తన జీవితాన్ని చాలా నిరాడంబరంగా గడిపారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా అసెంబ్లీ సమావేశాలకు మాత్రం బస్సులోనో, ఆటోలోనో వెళ్లేవారు. స్థానికంగా సైకిల్ తొక్కుతూ స్వంతపనులకు వెళ్ళేవారు.
ప్రజా పోరాటాల్లో ముందుండేవారు. గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా స్వగ్రామమైన సున్నంవారిగూడెంలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో నిన్న కరోనా పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో విజయవాడ తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.