telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీలో విషాదం..మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి

టీడీపీలో విషాదం చోటుచేసుకుంది..ఆ పార్టీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు.  ఆయన పరిస్థితి విషమించడంతో వారం క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్లుగా వైద్యులు నిర్దారించారు. 

Thumbnail image

చిత్తూరు జిల్లా ఉరందూరులో 1949, ఏప్రిల్ 15న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదివారు. 1972లో న్యాయపట్టా పుచ్చుకున్నారు.

ఆయన తండ్రి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే గంగా సుబ్బరామిరెడ్డి వారసుడిగా 1989లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం వ‌రుసుగా నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999-2004లో ఐటీ, ఆర్‌అండ్‌బీ మంత్రిగా, 2014లో అటవీశాఖ మంత్రి మంత్రిగా ప‌ని చేశారు.

అలిపిరిలో చంద్రబాబుపై నక్సల్స్ దాడి జరిగినప్పుడు.. అదే కాన్వాయ్ లో ఉండి.. గాయపడ్డారు.  ఆ గాయాలకు ఆయన చాలా కాలం పాటు చికిత్స తీసుకున్నారు. 

Bojjala 1

కాగా..ఇటీవల బొజ్జల పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన నివాసంలోనే చంద్రబాబు కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు జరిపించారు. టీడీపీ పేరు మీద రూపొందించిన కేక్‌ను బొజ్జలకు చంద్రబాబు స్వయంగా తినిపించారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు. తీవ్ర అనారోగ్యంతో మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తిరిగి ఆయనను కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు.

Related posts