టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగాడు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం టికెట్‌ను అధిష్ఠానం కేటాయించింది. ఢిల్లీలోని ఏడు స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ మహీశ్ గిరి స్థానంలో బరిలోకి దిగిన గంభీర్ కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ సింగ్ లవ్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషిలను ఎదుర్కోనున్నాడు.
తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఈ మేరకు ప్రకటించిన బీజేపీ నలుగురు సిట్టింగులకు తిరిగి టికెట్లు కేటాయించింది. ఏడో స్థానమైన నార్త్-వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడింటికి ఏడు స్థానాలనూ కైవసం చేసుకుంది.