ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన వైసీపీ అధినేత జగన్ 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ప్రమాణస్వీకార వేదికగా ఖరారు చేశారు. 30న ఉదయం 11.40 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రమాణం చేయనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు, జనం హాజరుకానున్నందున భద్రతాఏర్పాట్లపై ఇప్పటికే జగన్‌తో ఏపీ డీజీపీ ఠాకూర్ చర్చించారు. శుక్రవారం తాడేపల్లిలోని నివాసంలో జగన్‌తో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లపై చర్చించారు.
తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద పెద్దఎత్తున సందడి నెలకొన్నది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి జగన్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు. 23 మంత్రిత్వశాఖలకు చెందిన 57 మంది అధికారులు కూడా జనగ్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని ఇంటి వద్ద భారీగా కోలాహలం నెలకొనడంతో పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. క్యాంప్ కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకొన్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తున్నారు. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోతో కలిసి జగన్ నివాసానికి వచ్చిన వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలు ఇచ్చారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా గవర్నర్.. జగన్‌ను కోరుతారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్‌కల్లం నియమితులయ్యే అవకాశం ఉన్నదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజయ్‌కల్లం పదవీ విరమణ తర్వాత వైసీపీ కార్యక్రమాల్లో పాలుపంచుకొంటున్నారు. మ్యానిఫెస్టో రూపకల్పనలో కీలక సలహాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.
వైసీపీ లో మంత్రి పదవులు ఎవరెవరికి దక్కనున్నాయనేదానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. జగన్‌తోపాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు? ఏఏ ప్రాంతాలకు ప్రాధాన్యం ఉంటుంది? ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? అన్న అంశాలు ఆసక్తికంగా మారాయి. 151 స్థానాల్లో వైసీపీ గెలువడంతో ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది. సీనియర్లతోపాటు జూనియర్లు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ నియమాల ప్రకారం ముఖ్యమంత్రితోపాటు 25 మందికి మించకుండా మంత్రిమండలి ఉండాలి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీని స్థాపించినప్పుడు సీమాంధ్రకు చెందిన 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలిచారు. వీరిలో నలుగురైదుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అన్ని సామాజికవర్గాలతోపాటు ప్రాంతాలకు జగన్ ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు జగన్ ఇప్పటికే తన కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం.
వైసీపీ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా శనివారం శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఉదయం 10.31 గంటలకు తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో జరుగనున్న ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకొనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలంటూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలకు కూడా ఇప్పటికే ఆహ్వానం అందింది. ఉదయం 11.30 గంటలకు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులతోపాటు రాజ్యసభ సభ్యులను కూడా పార్టీ ఆహ్వానించింది. ఈ రెండు సమావేశాల అనంతరం పార్టీ ముఖ్యనేతలతో కలిసి జగన్ రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలువనున్నారు.
ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న వైఎస్ జగన్‌కు తాత్కాలిక కాన్వాయ్‌ని కేటాయించింది. ఏపీ 18పీ 3418 నంబరుతో ఉన్న ఆరు కొత్త వాహనాలను సమకూర్చారు. అదేవిధంగా జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్వో)ను కూడా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఏపీ సీఎం సెక్యూరిటీవింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆమర్లపూడి జోషిని సీఎస్వోగా నియమిస్తూ పోలీస్‌శాఖ నిర్ణయం తీసుకున్నది.
ఏం చూసుకుని మగాడ్నని ఫీల్ అవుతున్నాడో… మాధవీలత ఫైర్