eve teasing central minister anupriya patel

కేంద్ర మంత్రిని వేధించిన ఆ యువకులు…

33

దేశంలో మహిళలపై రోజు రోజుకు వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి, సదరు మహిళ సాధారణమైన వ్యక్తి అయినా, కేంద్రానికి మంత్రి అయినా వేధింపులు తప్పడం లేవని చెప్పడానికి నిదర్శనంగా ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సంఘటన ద్వారా చెప్పుకోవచ్చు. కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ ఉత్తర ప్రదేశ్ లోని లోక్ సభ స్థానం మీర్జాపూర్ నుంచి వారణాసి వస్తున్న సమయంలో కొందరు యువకులు ఆమె కాన్వాయ్ వెనకనుంచి నంబర్ ప్లేట్ లేని ఒక కారులోంచి ముగ్గురు యువకులు దూసుకొచ్చారు.

ఈ చేదు అనుభవంలో, మంత్రి గారి భద్రతా సిబ్బంది ఆ యువకులను వారించినా ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. సదరు సెక్యూరిటీ సిబ్బందిని కూడా బెదిరించారు. జిల్లా ఎస్పీ భరద్వాజ్ కి కంప్లైంట్ చేయడంతో ప్రత్యేక గాలింపు చేపట్టి సదరు దుండగులను మీర్జా మురాద్ లో అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

గతేడాది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ని కూడా నలుగురు దుండగులు అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు పట్టు దిట్టమైన భద్రత కలిగి ఉండే కేంద్ర మంత్రులకే ఈవ్ టీజింగ్ తప్పనప్పుడు సామాన్య మహిళలు ఇంకెన్ని వేధింపులకు గురవుతున్నారో ప్రభుత్వం తెలుసుకొని వేధింపులకు పాల్పడిన వారిని తల్లి దండ్రుల సమక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించడం, ప్రత్యేక బృందాలను మరింత పెంచి మహిళలకు రక్షణ కల్పించాలని కొందరు కోరుకుంటున్నారు.

రాష్ట్రంలో పెరిగిన ఈవ్ టీజింగ్ ను అరికట్టడానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీఎం కాగానే యాంటీ రోమియో స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు, అది చేసి ఏడాదిన్నర గడిచినా ప్రత్యేక మార్పు కనిపించకపోవడానికి నిదర్శనం ఈరోజు జరిగిన సంఘటనగా చెప్పుకోవచ్చు. దేశంలో మహిళలకు రక్షణ లేదు ఇంకెన్నాళ్లు మహిళలు ఇలా ఈవ్ టీజింగ్ బారిన పడాలి, ఇంకెన్నాళ్లు లైంగిక వేధింపులకు గురికావాలి, ఇంకెన్నాళ్లు ఆడపిల్ల పుట్టిందని చంపేయడం లేదా విడాకులు తీసుకోవడం లేదా భార్యను వదిలి భర్త బ్రతకడం సమాజంలో మార్పనేది రాదా అని కొందరి మహిళల్లో బయటకు రావాలంటేనే భయంతో ఆందోళన చెందుతున్నారు.

స్పృష్టికి రూపమైనటువంటి మహిళ, నీవు లేకపోతే లోకం లేదని సినిమాల్లో చెప్పుకోవడం లేదా ఏదైనా తీవ్ర సంఘటన జరిగినప్పుడు పదే పదే సమావేశాలు ఏర్పాటు చేయడం కన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ కుమారులను పెంచే క్రమంలో క్రమశిక్షణ అలవడేలా చర్యలు తీసుకొని, అంతే కాకుండా సమాజంలో కొందరు ఆడవాళ్లు కూడా కల్చర్ అని పోటీ పడి పొట్టి పొట్టి దుస్తులు ధరించి రెచ్చగొట్టే విధంగా కాకుండా కాస్త సంప్రదాయాన్ని అలవర్చుకుంటే ఇలాంటి ఘటనలు కొంతమేరకు తగ్గుతాయని,  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే భాద్యత ప్రభుత్వానికి, తల్లిదండ్రులకు సమానంగా ఉందని పలువురు కోరుకుంటున్నారు.