telugu navyamedia
తెలంగాణ వార్తలు

హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఏడోసారి ఈటల ప్రమాణ స్వీకారం..

తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజీపీ నేత ఈటల రాజేందర్‌ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత గన్‌పార్కులోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన ఈటల రాజేందర్.. అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు. ఆ త‌రువాత అసెంబ్లీలోని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం చేయించారు.

ఈ ప్రమాణ కార్యక్రమానికి బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్‌రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఇప్పటిదాకా ఏడుసార్లు ఈటల ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆరుసార్లు టీఆర్ఎస్, ఒకసారి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.

Etela Rajender: హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈటల రాజేందర్‌

కాగా, టీఆర్ ఎస్‌ మంత్రిగా ఉన్న ఈటలను పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12వ తేదీన ఈటల రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది.

ప్రమాణస్వీకారం అనంతం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో హక్కులు ఉండేవని అ‍న్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వంలో ఇప్పుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు గౌరవం లేదని తెలిపారు.

హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ దిమ్మ తిరిగిందని.. అందుకే ప్రెస్‌మీట్లలో ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ అహంకారం, అణిచివేతపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు త్వరలోనే ఆయనకు గుణపాఠం చెప్తారని తెలిపారు.

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అని అన్నారు. బీజేపీ నాయకత్వంలో కేసీఆర్ అవినీతి పాలనపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 

Etela Rajender Takes Oath As MLA In Telangana Assembly - Sakshi

మాజీ ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేసీఆర్ కాలరాశారని విమర్శించారు. తాను రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వడానికి వస్తే.. కనీసం స్పీకర్ అందుబాటులో లేకుండా కేసీఆర్ వ్యవహరించారని గుర్తుచేశారు. ఎన్ని కుట్రలకు పాల్పడినా హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ చెంప చెల్లుమనిపించేలా తీర్పు ఇచ్చారని ఈటల పేర్కొన్నారు.

ఎనిమిదేళ్ళుగా వరి ధాన్యం కొన్నది ఎవరో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ధర్నా చౌక్ అవసరం ఏంటో కేసీఆర్‌కు తెలిసొచ్చిందని ఎద్దేవా చేశారు. ధర్నా చౌక్ వద్దన్న వాళ్ళే ధర్నా చౌక్ లో ఆందోళనలు చేస్తానంటున్నారు. మిల్లింగ్ టెక్నాలజీని పెంచుకోవటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

కేసీఆర్ గంటకొద్దీ ప్రెస్ మీట్స్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేసీఆర్ పెద్ద నోరుతో చెబుతున్న అబద్దాలన్నీ నిజాలు అయిపోవని అన్నారు. ప్రజల మీద ప్రేమ ఉంటే కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని ఈటల డిమాండ్‌ చేశారు.

Related posts